కలి వస్తేనేగాని ధర్మానికి పతనమేర్పడదు. అది పరాకాష్ఠ నందుకొంటే గానీ మరలా యుగాంతంలో కల్కి అవతరించి ధర్మోద్ధరణచేసి కృతయుగాన్ని ప్రవర్తింపజేయడు. ఇలా తొమ్మిదవదైన కృష్ణావతారం పరిసమాప్తమై పదియవదైన కల్క్యవతారం ప్రారంభమయ్యే మధ్య కాలంలోనే భాగవత మవతరించింది. ధర్మవిప్లవం ఏర్పడినప్పుడే గదా భగవత్కథా శ్రవణం చేసి తరించాలి మానవుడు. అలా తరించినవాడే పరీక్షిత్తు. వారే శౌనకాది మహర్షులు. వారేమిటి. ఆ పురాణ పాత్రలను నిమిత్తం చేసుకొని మనబోటి కలికాల మానవులు కూడా. ఇదంతా దృష్టిలో పెట్టుకొనే మహర్షి ఆదిలోనే కృష్ణ నిర్యాణాన్ని నిబంధించాడు.
అంతేకాదు ఇది దేశకాలాదులను బట్టి చెప్పిన మాట. పోతే పాత్ర విశేషాన్ని బట్టి చూచినా అదే సబబని తోస్తుంది. పాండవులు వారి బంధు మిత్రాదులూ ఇక్కడ పాత్రలు. వారు కృష్ణుని అనంతరం కూడా బ్రతికి ఉన్నారు. అప్పటికే తమ సహోదరులైన ధార్త రాష్ట్రులంతా మరణించారు. ఎందరో బంధువులూ, మిత్రులూ అస్తమించారు. యాదవులు కూడా కాలధర్మం చెందారు. ఇక మిగిలి ఉన్న జీవచ్ఛవాలు తాము మాత్రమే. వారికింకా ఈ ప్రాపంచిక వాసనలు వదలలేదు. అవి పూర్తిగా వదలి పోవాలంటే ఎన్ని గీతోపదేశాలు చేసినా లాభం లేదు. ఎంతగా తాను వారికి సహాయం చేసినా మహిమలు చూపినా సుఖం లేదు. తాను బ్రతికి ఉన్నంతవరకూ ఇంకా కొండలాగా ఇతడు మనకండగా ఉన్నాడులే మనకేమని బరవసా పడతారు వారు. అది వారికి తొలగాలంటే తానసలు లోకంలోనే లేకుండా పోవాలి భగవానుడు. ఇక మరలా కంటికి కనపడగూడదు. అలాగే జరిగింది చివరకు. అర్జునుడా నలుసంత వార్త తెలుసుకొని వచ్చాడు. అన్నగారి చెవిలో వేశాడు. అందరూ ఎంతగానో ఆక్రందన చేసి అంతవాడే పోయాడిక మనమనగా ఎంత వాళ్లమని పూర్ణ వైరాగ్య భావంతో పరీక్షిత్తుకు పట్టాభిషేకం చేసి మహాప్రస్థానాని కుద్యుక్తులవుతారు. అంతకు ముందే వారి తల్లి కుంతీ, గాంధారీ ధృతరాష్ట్రులూ అంతా సెలవు తీసుకొంటారు. ఇలా ఆయా పాత్రల ప్రవృత్తిని బట్టి చూచినా తత్ప్ర బోధకమైన కృష్ణ నిర్యాణమే మొదట చెప్పవలసిన ఆవశ్యకత కనిపిస్తుంది. అసలు భాగవతా కథా శ్రోత అయిన పరీక్షిత్తు జీవితం పాండవ ప్రస్థానమైతే కాని ఆరంభం కాదు. మరి పాండవుల ప్రస్థానం కృష్ణ నిర్యాణానంతరం గాని జరగదు. అంచేత కృష్ణ నిర్యాణ కథ భాగవతా రంభంలోనే ఉండి తీరాలి.
Page 84