మాత్యుడు దీన్ని కృష్ణ కథామృతమని నిర్దేశించాడు. రామ భక్తుడయి కూడా కృష్ణస్తుతితో గ్రంథాన్ని ప్రారంభించి షష్ఠ్యంతాలలో కూడా కృష్ణుణ్ణి స్మరించాడాయన.
మొత్తానికి భాగవత కథ అంతా విష్ణుమయమే కృష్ణమయమే. అందుకే అసలు కృష్ణుడితో ఆరంభమై కృష్ణుడితో అంతమవుతున్నది పురాణం. ఆద్యంతాలలో ఏది ప్రస్తావిస్తే అది ప్రధానమని ఆర్యులమాట. ప్రథమ స్కంధంలో నారదుని వృత్తాంతంలోనే అసలు కృష్ణ కథ వస్తూంది. పరీక్షిత్తు జననమే తదనుగ్రహంతో జరిగింది. ఆ తరువాత అర్జునుడు వచ్చి ధర్మరాజుకు కృష్ణ నిర్యాణ వార్త వినిపించిన వృత్తాంతం వస్తుంది. పోతే మొదటి మూడు నాలుగు స్కంధాల వరకూ కృష్ణ చరిత్ర నడుస్తూనే ఉంటుంది. సప్తమ స్కంధంలో శిశుపాల వధ వృత్తాంతం దగ్గర మళ్లీ కనిపిస్తుంది. పోతే ఇక దశమ స్కంధంలో ఆయన జన్మ వృత్తాంతం దగ్గరి నుంచీ పూర్వోత్తర భాగాలలో అతివిపులంగా కృష్ణ చరిత్ర అంతా సాక్షాత్కరిస్తుంది. ఏకాదశ స్కంధాంతం దాకా ఆ చరిత్రే. అక్కడ మరలా కృష్ణ నిర్యాణ గాథ. పోతే ద్వాదశంలో భవిష్య వృత్తాంతమూ దాని కనుబంధమైన కల్యవతారమూ తప్ప మరేదీ చెప్పుకోదగ్గ కథలేదు. ఇలా ఆది మధ్యావసానాలలో పురాణంలో ఎక్కడ చూచినా కృష్ణతత్త్వమే సాక్షాత్కరించటం మూలాన ఇది కృష్ణచరిత్ర అని చెప్పటంలో ఆశ్చర్యం లేదు.
అయితే ఇక్కడ ఒక చమత్కారం. ప్రథమ స్కంధం ఆదిలో కృష్ణ నిర్యాణమూ, దశమ స్కంథంలో ఎక్కడో కృష్ణ జననమూ వర్ణించటం వింతగా కనిపిస్తున్నది మనకు. మరలా ఏకాదశాంతంలో నిర్యాణం వర్ణించటం కూడా చిత్రమే. నిర్యాణమూ, జననమూ, నిర్యాణమూ, ఏమిటీ వరస. మహర్షి ఇలా కథా వర్ణన చేయటంలో ఆయన ఉద్దేశించిన మర్మమేమిటని ప్రశ్న. దీనిలో చాలా ఉంది మనం తెలుసు కోవలసిన మర్మం. కృష్ణ నిర్యాణమైన తరువాతనే భాగవత రచన ఆరంభమయింది. అప్పటికి ద్వాపరమయిపోయి కలియుగం మొదలవుతుంది. కలియుగం మొదలయి నప్పుడే పరీక్షిత్తు పరిపాలన. అప్పుడే ధర్మమనేది క్షీణించటం చూచాడాయన. అది క్రమంగా క్షీణీస్తూ చివరకు కలియుగాంతంలో అసలే లేకుండా అంతరిస్తుంది. దానితో మరలా కృతయుగారంభం కావలసి ఉంది. ఈ ధర్మ విప్లవం కృష్ణ నిర్యాణంతో ఆరంభమై మరలా కల్క్యవతారంతో పునరుద్ధరణ కావలసి ఉందని సూచించటానికే కృష్ణ నిర్యాణమాదిలో వర్ణించవలసి వచ్చింది. నిర్యాణం జరగనిదే కలియుగం రాదు
Page 83