4. రచనా ప్రణాళిక
భాగవత సంకేతాన్ని ఇంతవరకూ మనం చర్చిస్తూ వచ్చాము. ఆద్యంతాలూ దానితోనే నిండి ఉన్నాయని - అందులోని ప్రతికథా కూడా పురాణ ముద్దేశించిన మోక్ష పురుషార్థాని కొక చక్కని సంకేతమేనని పేర్కొన్నాము. పోతే ఆ వివక్షితమైన లక్ష్యాని కనుగుణంగా సాగిన ఈ కథా నిర్మాణమేమిటో దాని రచనా ప్రణాళిక ఏమిటో సాంగోపాంగంగా మనం పరిశీలించవలసి ఉంది. కథలంటే భాగవతానికే గాదు. హరివంశ విష్ణు పురాణాలకు కూడా అదే కథా వస్తువు. అయితే భాగవతంలో లేని కథలు కొన్ని హరి వంశాదులలో అదనంగా కనిపిస్తాయి. హరివంశమనేది విష్ణు పర్వమనీ, హరివంశ పర్వమనీ, భవిష్య పర్వమనీ మూడు భాగాలున్నాయి. విష్ణు పర్వంలో పారిజాత వృత్తాంతమూ, వజ్రనాభ వృత్తాంతమూ వస్తాయి. ఇవి రెండూ భాగవతంలో లేవు. అలాగే భవిష్య పర్వంలో కృష్ణుడి కైలాస యాత్రా -ఘంటాకర్ణుడి చరిత్రా - పౌండ్రక వాసుదేవుడి వృత్తాంతము హంస డిభకో -పాఖ్యానమూ వస్తాయి. ఇవన్నీ భాగవతంలో కనిపించవు. అలాగే విష్ణు పురాణంలో ఖాండిక్య కేశి ధ్వజో పాఖ్యానమొకటి అదనంగా ఉంది. అది భాగవతంలో లేదు. పోతే భాగవతంలో వచ్చే దక్ష యజ్ఞ వృత్తాంతం హరి వంశాదులలో కనిపించదు. అయినా పరవాలేదు. అన్నీ భగవత్కథలే అయినప్పుడు కొన్ని తక్కువైతేనేమి కొన్ని ఎక్కువైతే నేమి అన్నీ కలిసి మన పాలిటికి భాగవతమే. భగవంతుడికి సంబంధించింది గదా భాగవతమని చెప్పాము. పైగా మోక్ష పురుషార్థ ప్రతిపాదకమైనది. మోక్షప్రదాత మనకు భగవంతుడే, మరి ఆ భగవంతుడి కథ గాకపోతే మరేదవుతుంది ప్రతిపాద్యమైన అంశం. -
అయితే భగవంతుడి కథ అన్నారే. అదేమిటా కథ. భగవంతుడంటే సోపాధికమూ కావచ్చు నిరుపాధికమూ కావచ్చు. నిరుపాధికం స్వరూపమైతే సోపాధికం నామరూప చేష్టాదికమైన విభూతి అని చెప్పాము. ఈ రెండింటినీ వర్ణిస్తే అదీ ఆయన కథ. ఇందులో స్వరూపం కంటే విభూతి వర్ణనే నూటికి తొంబది
Page 81