ప్రస్తుత మీ భాగవతమనే ఫలం కూడా శుకముఖ దష్టమే. శుకమహర్షి వదనం నుంచే గదా ఊడి పడ్డదది. ఇది కూడా అమృతోపమానమే. అమృతోపమానం గాదు. అమృతమే. అమృతత్వాన్నే మనకు ప్రసాదించే ఫలమది. ఇంకా గొప్పది. పిబత భాగవతం రసమాలయం. ఇలాంటి భాగవత రసాన్ని పానం చేయాలి మనం. ఫలమన్నారు. రసమన్నారు. ఇంతకూ ఫలాన్నా మనం పానం చేయవలసింది రసాన్నా. ఫలమని చెబుదామా దాన్ని భక్షించవలసిందే గాని పానం చేయటానికి లేదు. పోనీ రసమనుకొందామా ఫలమనే ఆశ్రయం లేకుండా నిరాధారంగా ఎక్కడా లేదది మనం పానం చేయటానికి. మరేమిటి గతి. అందుకే ఫలమనీ రసమనీ కూడా పేర్కొనటం. ఏది ఫలమో అది రసమే. ఏది రసమో అది ఫలమే. రెంటికీ ఇలా సామానాధికరణ్యం Identity చెప్పటం వల్ల ఫలమని పేరేగాని అదంతా రసమయమే నని తేట పడుతున్నది. లోకంలో ఫలం లాంటిది కాదప్పటికి. లౌకికమైన ఫలంలో రసం కానిదెంతో ఉంటుంది. పనికి రానిది. తొక్క టెంకె గింజ పీచు ఇలాంటి దెంతైనా ఉంటుంది. దానిని వర్ణించి గాని మనమా ఫలాన్ని భక్షించటానికి లేదు. ఇక్కడ అలా కాదు. ఫలమంతా రసమే. అంటే హేయమైన అంశమందులో ఏ మాత్రమూ కానరాదు. అంతా మన కుపాదేయమే. అలాటిది ఈ భాగవత ఫలమని భావం.
అందుకే పిబత - ఆస్వాదించండని ప్రబోధిస్తున్నాడు మహర్షి. ఎంత కాలం. ఇంత కాలమని ప్రశ్నేలేదు. ఆలయమ్ - లయమయ్యేదాకా ఆస్వాదించవలసిందే. అంటే మన మనసు దానిలో లయమయి అమనస్కయోగం సిద్ధించే దాకా నైనకావచ్చు. లేదా “ఆ సుప్తేరామృతేశ్చైవ నయే ద్వేదాంతచింతయా” అన్నట్టు ఆ మరణాంతమూ అయినా కావచ్చు. లేదా అసలీ జీవభావమే లయమై మనకా బ్రహ్మ భావం సిద్ధించేదాకా ఎన్ని జన్మలకైనా కావచ్చు. మొత్తంమీద జీవేశ్వరుల మధ్య ఉండే ఉపాధి భేదం పూర్తిగా నశించిపోవాలి. అంతదాకా ఎన్ని జన్మలు పట్టినా పరవాలేదు. సేవిస్తూనే పోవచ్చు ఈ భాగవతామృత రసాన్ని మానవుడు. అదీ రోజుకొక మారు లాంఛనార్థంగా చేసి కూచోటం కాదు. దీర్ఘకాల నైరంతర్య సత్కార సేవితః అన్నట్టు నిర్విరామంగా ప్రతిక్షణమూ సేవిస్తూనే పోవాలి. అప్పుడే అది ఫలకారి మనకు. అందుకే “ముహు రహో రసికా భువి భావుకాః" అని హెచ్చరిక. అయితే ఇలా ముహుర్ముహు రుప సేవనా శీలురం కావాలంటే మనం రసికులమూ, భావుకులమూ
Page 53