ఇది బ్రహ్మాభ్యాస శీలుడైన వాడి లక్షణం. "తచ్చింతనమ్ తత్కథనమ్ అన్యోన్యం తత్ప్రబోధనమ్ – ఏతదేక పరత్వంచ బ్రహ్మాభ్యాసం విదుర్బుధాః” అన్నారు పెద్దలు. ఇదే నారదుని జీవితంలో మనకు కనిపించే వ్యవహారం. భాగవత ధర్మానికి ప్రతీక అని చెప్పాము. తద్ధర్మ సంకీర్తనమే గాయత్రి. నారదుని వీణా గానమదే. బ్రహ్మాకార వృత్తి అని అర్థం. అది నిరంతర మాలపిస్తున్నాడంటే గాయత్రీ మంత్రాన్నే కీర్తిస్తూ తిరుగుతున్నాడని భావం. “పరో రజసిసావ దోమ్” అనే నాలుగవ పాదంతో కలిసి గాయత్రికి ముప్పది రెండక్షరాలు. అవి సరిగ్గా వీణకుండే ముప్పది రెండు మెట్లకూ చక్కగా సరిపోతాయి. “దేవదత్తా మిమామ్ వీణామ్ గాయ మానశ్చరామ్యహమ్” దేవదత్తమైన ఈ వీణ పట్టుకొని గానం చేస్తూ చరిస్తున్నానని స్వయంగానే చెప్పుకొంటాడు. అంతేగాదు. ప్రగాయతః స్వవీర్యాణి ఆహూత ఇవ మే శీఘ్రం దర్శనం యాతి చేతసి. అలా భగవద్గుణ గానం చేస్తూ క్రుమ్మరుతుంటే ఆ భగవానుడెప్పుడూ నా మనోనేత్రానికి దర్శనమిస్తుంటాడని కూడా చాటుతాడు. ఇలా గానం చేయటమే గాయత్రీ మంత్ర పఠనం. తద్వారా బ్రహ్మాభ్యాసం నిరంతరమూ తాను చేయటమే గాక ముముక్షులోకానికంతటికీ అందిస్తున్నాడు నారదుడు. ఆయన ఈ వ్యవహారం గాయత్రీ మంత్రార్థ సంకేతం. అదే భాగవత ధర్మం.
మొత్తానికిలా మానవ జీవిత సర్వస్వమైన సత్యధర్మాలను రెంటినీ సూటిగానూ వృత్తాసురాది వృత్తాంతాలతో చాటుగానూ వేనోళ్ళ చాటుతున్నదీ భాగవత మహాపురాణం మనకు. భాగవత కథా ప్రవర్తకులైన శుక నారదులు కూడా ఆ రెండు ఆదర్శాల కోసం నడుముకట్టి నిలిచిన వారేనని తేటపడుతున్నది. ఇలాటి మహోదాత్తమైన మోక్షైక ప్రయోజనమైన సర్వజన మనోజ్ఞమైన - భాగవత మహత్వాన్ని ఏమని వర్ణించటం. "నిగమ కల్ప తరోర్గళితమ్ ఫలమ్" వేదమనే కల్పవృక్షానికి పండిన ఒకానొక అద్భుతమైన ఫలమది. అది కూడా పతితం కాదు. గళితమట. ఒక్కసారిగా చెట్టునుంచి పడితే అది క్రిందబడి పగిలిపోతుంది. రసం చిందర వందరై దానిని మన మాస్వాదించలేము. అంచేత దానిని నెమ్మదిగా చిక్కం పెట్టి క్రిందికి జారేలాగా జార్చుకోవాలి. అలాంటి చిక్కమేదో గాదు. శుకముఖా దమృత ద్రవ సమ్మితమ్. శుక ముఖమే ఆ చిక్కం. శుకమంటే చిలుక. చిలుక కొరికన పండు చాలా మధురంగా ఉంటుందని లోకంలో వాడుక. అమృత సమానమది
Page 52