#


Index

భాగవత ప్రాశస్త్యము

నిరస్త కుహకం. నిరస్త కుహక మన్నప్పుడది వైరాగ్యమే. అనాత్మ జగత్తు మీద విరక్తి చెందటమే గదా కుహక నిరాసం. ఇది శుకుడి వ్యవహారంలో అక్షరాలా సాక్షాత్కరిస్తుంది. “శుకుడు గోచియు లేక” గోచిపెట్టటం దగ్గరి నుంచీ విరక్తుడతడు. గోదోహన మాత్ర కాలం కూడా ఒకచోట నిలిచేవాడు కాడు. పుత్రా పుత్రా అని తండ్రి వెంటబడ్డా తిరిగి చూడని మమకార దూరుడు. దారిలో స్త్రీలో పురుషులో కూడా ఎవరో కన్నెత్తి చూడని ముక్తసంగుడు. సర్వసముడు. తన్ను పిలిచిన వారికి తనకు మారుగా సమస్త ప్రకృతి చేతనే సమాధాన మిప్పించగల సర్వాత్మభావ సంపన్నుడు. వైరాగ్యానికింత కన్నా పరమావధి ఏముంది. సత్యంతో తాదాత్మ్యం చెందిన వాడికే అది దక్కుతుంది.

  కాగా నారద మహర్షి అభ్యాసానికి ప్రతీక అని పేర్కొన్నాము. నారమ్ ద్యతీతి నారదః నర సంబంధి అయిన అజ్ఞానాంధకారాన్ని చీల్చి పారేసినవాడు నారదుడు. తాను పారవేయటమే గాదు. నారమ్ దదాతి. నారమంటే నరులకు కావలసిన బ్రహ్మజ్ఞానం. దాన్ని ప్రసాదించే వాడు కూడ నారదుడే. స్వయం తీర్ణః పరాంస్తారయతి అన్నారు. తాను తరించి ఇతరులను తరింపజేయాలి. అభ్యాస శీలుడైన వాడు చేయవలసిన పని అదే. కేవల విరక్తుడైతే వాడాత్మారాముడు. అభ్యాసి లోక సంగ్రహ పరాయణుడు కూడా. శుకుడు ఆత్మారాముడైతే- నారదుడు లోక సంగ్రహ తత్పరుడు. అయితే ఆత్మారాముడు లోకులకెంత మాత్రమూ ఉపయోగపడడని కాదు మరలా. అలాగైతే శుకుడు పరీక్షిత్తు వద్దకు వచ్చేవాడే కాదు. భాగవత ప్రవచనం చేసి ఉండేవాడే కాదు. రావచ్చు. చేయవచ్చు. కాని అది కాదాచిత్కం వాడికి. “యోంతస్సు భోంతరా రామ" అన్నట్టు ఆత్మారామం తప్ప బాహ్యారామమంతగా పట్టదలాంటి వాడికి. వాడే శుకుడు. పోతే నారదాదులలాంటి కేవలాత్మారాములు కారు. ఆత్మ జ్ఞాన నిషే లేదని కాదు వారికి. అది ఉంటూనే దానితో పాటు లోకోద్ధరణ దృష్టి కూడా ఉంటుంది. అందుకే శుకుడు లోకానికి చాలావరకు దూరదూరంగా ఉండిపోతే నారదుడు సదా లోకంతో సంసర్గం పెట్టుకొని మూడు లోకాలూ సంచరిస్తుంటాడు. దేవతలూ, మానవులూ, దానవులూ మూడు జాతులతోనూ సంబంధమే ఆయనకు. అంటే త్రిగుణాతీతుడయి మరలా త్రిగుణాత్మకమైన సృష్టితో వ్యవహరిస్తూ ఉంటాడని భావం. అలా వ్యవహరిస్తూ కూడా వాని స్పర్శ ఏ మాత్రమూ సోకని వాడాయన

Page 51

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు