#


Index

భాగవత ప్రాశస్త్యము

ఓమ్ తత్సవితు ర్వరేణ్యమ్
భర్గో దేవస్య ధీమహి
ధియో యోనః ప్రచోదయాత్

  ఇది గదా గాయత్రి అంటే. సవిత అంటే సర్వజగత్తునూ సృష్టించిన పరమాత్మ. తన పాటికి తాను సృష్టించ లేదాయన. ఆయన నాశ్రయించి ఒక శక్తి ఉన్నది. అదే భర్గః తేజోరూపిణి. మహామాయ. తేజో 2 బన్నాత్మకంగా గదా సృష్టి జరిగింది. తేజస్సే సృష్టికి మూలం. సవితకు చెందింది కాబట్టి దానికి సావిత్రి అని పేరు. ఇది సృష్టిలో మరి ఎక్కడా అభివ్యక్తం కాలేదు. ఒక్క మానవుడి బుద్ధిలోనే అయిందిది. కనుక ఈ బుద్ధి ద్వారా ఎప్పటికైనా దానినే మనం పట్టుకొని పోవాలి. అదే మనకు వరణీయం లేదా వరేణ్యం. అంటే భజించవలసినదని అర్థం. అలా భజిస్తే అది మన బుద్ధులను అధోముఖంగా ఈ అనాత్మ జగత్తు వైపు ప్రసరించకుండా ఊర్ధ్వముఖంగా ఆత్మస్వరూపమైన ఆ తత్పదార్థమైన పరమాత్మ వైపే మళ్లించి మనకు సాయుజ్యాన్ని ప్రసాదిస్తుంది. ఇదే “ధియో యోనః ప్రచోద యాత్త”నే దాని అర్థం. దీనితో మొదట జగత్సృష్టికి హేతుభూత అయిన సావిత్రి - మరలా జగత్ప్ర విలాపనం Merger ద్వారా బ్రహ్మ సాయుజ్యానికి దారితీస్తూ గాయత్రిగా పరిణమించింది. గానాత్రాయత ఇతి గాయత్రీ. తన్ను గానం చేస్తూ భజించే వారిని క్రమంగా తన మూల స్థానాన్ని చేర్చి కాపాడుతుంది. కాబట్టి గాయత్రి అనే మాట సార్థకమవుతున్నది. ఒకటి బంధావస్థకైతే మరొకటి మోక్షావస్థకు. ఇవే తిరోధాన అనుగ్రహముఖాలు మాయాశక్తికి.

  సరిగా ఈ శక్తి ద్వయ గర్భిణి అయిన గాయత్రికి సంకేతమే ధర్మమనే మాట. అది కైతవంతో కూడినదైతే తిరోధానం. సంసార బంధానికే దారితీస్తుంది. అలాకాక ప్రోజ్ఞిత కైతవమైతే అనుగ్రహం. భగవత్సాయుజ్యానికే చేయూత నిస్తుంది. ఇలాటి మోక్షధర్మాన్నే భాగవతం నిరూపిస్తుంది. భగవద్భక్తులందరూ పాటించిన, పాలించిన ధర్మమదే. భర్గోదేవస్య ధీమహి అని యావజ్జీవమూ వారు ఎలాంటి ఆపదలు సంభవించినా విడవకుండా దానినే అంటి పట్టుకొని జీవితం గడిపారు. కనుకనే వారి బుద్ధులనీ సంసార బంధం నుంచి తప్పించి అది క్రమంగా వారి నా పరమ పదాన్ని చేర్చేందుకే తోడ్పడింది.

Page 49

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు