#


Index

భాగవత ప్రాశస్త్యము

అలాటి నిత్యముక్తుణ్ణి భజిస్తే వీడూ భ్రమర కీటన్యాయంగా ముక్తుడవుతాడు. వీరిరువురికున్న ఈ ఆంతరిక సంబంధాన్ని నిరూపిస్తుంది గనుకనే భాగవతమనే సంజ్ఞ సార్థకమవుతున్నది భాగవతమంటే భగవంతుడి చరిత్ర కావచ్చు. భాగవతుల చరిత్ర కావచ్చునని గదా ఇంతకు ముందు పేర్కొన్నాము.

  భాగవతానికి మరి రెండు నామధేయాలు కూడా ఉన్నాయి. ఒకటి సాత్వత పురాణం. వేరొకటి పారమ హంస్య సంహిత. సత్త్వగుణ ప్రధానుడు సత్త్వంతుడు. త్రిమూర్తులలో సత్త్వం విష్ణువుది. కాబట్టి సత్త్వంతుడంటే విష్ణువు. ఆయన గుణ చేష్టాదులను వర్ణించేది గనుక ఈ పురాణం సాత్వతమయింది. అంతేకాదు. ఆయనే గాక ఆయన భక్తులు కూడా సత్త్వగుణ ప్రధానులే. కనుక సాత్వతమంటే ప్రహ్లాదాది భాగవతుల చరిత్ర కూడా నని అర్ధం చెప్పుకోవచ్చు. పోతే ఇక పారమ హంస్య మనే మాట. పరమ హంసలకు సంబంధించింది పారమ హంస్యం. కుటీచక బహూదక హంస పరమహంసలలో పరమహంస దానిని కూడా దాటిపోయి ఆత్మ విద్య పారాన్నే అందుకొన్నవాడు. అసలు హంస జీవాత్మ అయితే పరమహంస నిత్యముక్తుడైన పరమాత్మ. ఈ హంసలు రెండింటి వృత్తాంతమూ మనకు పురంజనో పాఖ్యానంలో వ్యంగ్యంగా వాచ్యంగా కూడా వివరించింది భాగవతం. అప్పటికి పరమాత్మకు చెందినదే పారమహంస్యమంటే. అలాంటి పరమాత్మ తత్త్వాన్ని అందుకోవలసిన వాడు గనుక ముముక్షువైన జీవుడికి చెందినది కూడా కావచ్చు. మొత్తం మీద ముముక్షువులైన గృహస్థులూ, సన్న్యాసులూ ఇద్దరూ దీని కధికారులే. ఆగమరూపమైన ఉపనిషత్తులు కేవలం సన్న్యాసులకే నని నియమమున్నా ఇది పురాణ సంహిత గనుక స్త్రీ శూద్రాది న్యాయాన్ని బట్టి మిగతా ఆశ్రమాల వారికి కూడా పఠన యోగ్యమే.



  పోతే ఈ భాగవత మాహాత్మ్య మెలాటిదో మనకు మొదటి రెండు శ్లోకాలే ఎంతో మనోజ్ఞంగా ప్రతిపాదిస్తాయి.

జన్మాద్యస్యయతో 2 న్వయా దితరత శ్చార్థేష్వభిజ్ఞః స్వరాట్
తేనే బ్రహ్మా హృదాయ ఆది కవయే - ముహ్యంతి యత్సూరయః
తేజో వారి మృదామ్ యథా వినిమయో యత్ర త్రిసర్గోమృషా
ధామ్నా స్వేన సదా నిరస్త కుహకమ్ సత్యమ్ పరమ్ ధీమహి

Page 43

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు