#


Index

భాగవత ప్రాశస్త్యము

ఏ వైరుద్ధ్యమూ ఉండబోదు. అది లేకనే ఈ విరోధాభాస. ఆ మాటకు వస్తే శ్రుతి స్మృతులలోనే ఎన్నో పూర్వాపర విరుద్ధాంశాలు గోచరిస్తాయి. అవి కేవల మాభాసమే గాని నిజానికే వైరుద్ధ్యమూ లేదని భగవత్పాదుల లాంటి మహనీయులు తెలిపేంత వరకూ లోకానికి తెలియలేదు గదా. అలాగే ఇందులో కూడానని మనమర్థం చేసుకోవలసి ఉంది. అందుకేనేమో భాగవతము తెలిసి పలుకుట కష్టంబని మహాకవి వాపోయింది. తెలిసి పలకాలంటే ఏదైనా సామాన్యం కాదు. దానికి స్వకీయమైన ఆలోచన మాత్రమే సరిపోదు. విబుధ జనులతోడి సాంగత్యముండాలి. ఎవరా విబుధులు “బుధా భావ సమన్వితాః" అన్నది గీత. బుధాః అంటే అవగత పరమార్థ తత్త్వాః అని అర్థం వ్రాశారు భగవత్పాదులు. గ్రంథ పరమార్థమేదో అది గ్రహించినవాడే బుధుడు. అలాంటి వారే భాగవత వ్యాఖ్యాతలైన శ్రీధరాదులు. వారే పోతనకు మార్గదర్శకులు. మరి వారంతా భాగవతం వ్యాసరచితమనే విశ్వసిస్తూ వచ్చారు. కాబట్టి అటు లోకంలోనూ ఇటు కతిపయ పండిత లోకంలోనూ ఇంతగా ప్రఖ్యాతిగాంచిన ఈ పురాణాన్ని ప్రామాణికంగా స్వీకరించటంలో మనకిక అభ్యంతరం ఉండరాదు. ఎక్కడైనా కొన్ని చిక్కులుంటే విష్ణు పురాణ హరివంశాలుండనే ఉన్నాయి మనకు. వాటి వెలుగులో చూచి సమన్వయించుకోవచ్చు. ఆ మాటకు వస్తే అవి కూడా నిజానికి భాగవతమే గదా.

  భాగవతమంటే ఏమిటసలు. భగవత ఇదమ్ భాగవతమన్నారు. భగవంతుడి చరిత్ర భాగవతం. భగోస్యాస్తితి భగవాన్ అని భగవచ్ఛబ్దానికి వ్యుత్పత్తి. "ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశసః శ్రియః జ్ఞానవైరాగ్యయోశ్చైవ - షణ్ణామ్ భగ ఇతీరణా” అని విష్ణు పురాణ వచనం. జ్ఞానైశ్వర్య బల వీర్యయశో వైరాగ్య సంపదలనే ఆరు గుణాలకూ భగమని పేరు. ఈషాడ్గుణ్యమూ ఎవనిలో సమగ్రంగా ఉందో వాడు భగవానుడు. మరొక విధంగా కూడా నిర్వచిస్తారు భగవచ్ఛబ్దాన్ని "ప్రవృత్తించ నివృత్తించ-భూతానా మాగతిమ్ గతిమ్- వేత్తి ధర్మ మధర్మంచ-సవాచ్యో భగవానితి” ప్రవృత్తి నివృత్తులూ - గతా గతాలూ - ధర్మా ధర్మాలూ ఈ ఆరూ పరిపూర్ణంగా తెలిసిన వాడే భగవంతుడట. ఏదైనా ఒక్కటే. ఒక్క మాటలో చెబితే జ్ఞానశక్తీ క్రియాశక్తీ రెండు శక్తులూ స్వత స్సిద్ధంగా సమగ్రంగా ఉన్నవాడని చెప్పవచ్చు. ఇవి జీవుడికీ ఉన్నాయి కాని సమగ్రం కావు. కావు గనుకనే వీడు ముముక్షువు. వాడు నిత్యముక్తుడు

Page 42

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు