#


Index

భాగవతము - సందేశసారము

పరధర్మమైన దానవ ధర్మాన్ని అనుసరిస్తేనే అది మహాప్రమాదం. “స్వధర్మే నిధనమ్ శ్రేయః పరధర్మో భయావహః” అని గీత చెప్పిందంటే అది ఈ దృష్టితో కూడా.

  అయితే ఎవరెంత చెప్పినా మానవుడు తాను తన బుద్ధితో గ్రహించి మార్గంలో నడవనంత వరకూ ప్రయోజనం లేదు. ఎవడికి వాడు గ్రహించుకోవాలి. అదీ అందరూ గ్రహించాలి. అలా ఎప్పటికీ జరగదు. కొంత కాలం బ్రహ్మ ప్రయత్నం మీద అలా నడచినా ఎప్పటికో ఒకప్పటికి మార్గం తప్పుతాడు మానవుడు. దానికి మూలమతని కామమే. కామరూపుడే గదా మానవుడంటే. అది ధర్మంచేత నిగృహీతమై ఉంటుంది చాలావరకు. ధర్మమెప్పుడు దుర్భలమవుతుందో అప్పుడిది ప్రబలమై జాతి వినిపాతానికే దారి తీస్తుంది. అదే యుద్ధం. అదే వినాశం. అదే యుగాంతం. అప్పుడప్పుడలా జరిగిందని భంగ్యంతరంగా చెప్పుతూ వచ్చింది భాగవతం మనకు. యాదవ కులంలో ముసలం పుట్టటమూ దాని ప్రభావంతో వారంతా చివరకు సమసిపోవటమూ, ఈ సంఘటన ఒక్కటి తరచి చూస్తే చాలు మనం. కృష్ణుడి సందర్శనార్థం మహర్షులు రావటమేమిటి. వారిని యాదవ బాలురంతా కలిసి అవహేళన చేయటమేమిటి. వారా వంశానికి శాపమివ్వటమేమిటి. దానితో వారు సమసి పోవటమేమిటి. కృష్ణుణ్ణి చూడటానికి వచ్చి వాళ్లు కృష్ణుడి వంశానికే ఎసరుపెట్టారు. ఏమిటీ అన్యాయం. అన్యాయం కాదు. న్యాయమే. “వినాశకాలే విపరీత బుద్ధి:" అన్నట్టు వినాశం కావలసి వచ్చి వారికా దుర్బుద్ధి పుట్టింది. అది వారి ప్రాక్తన కర్మ పరిపాకమే. దానికి మహర్షుల శాపమనేది ఒక నిమిత్తం. ఇదంతా ఫలితానికి రావాలంటేభగవత్సంకల్పం కూడా తోడు కావాలని చెప్పాము గదా. అందుకే కృష్ణుడి ఉదాసీనత. అన్నీ తెలిసి కూడా అది ఎలాగూ తప్పదని ఆయన ప్రతీకారమాలోచించలేదు. ఆలోచించకపోగా హతశేషులైన వారొకరిద్దరు కనపడితే వీరు మాత్రమెందు కుండాలని వారిని తానే స్వయంగా మట్టుపెట్టాడు.

  భాగవతంలో ఈ సన్నివేశం చదువుతుంటే మనకీనాటి ప్రపంచ ధోరణికి సరిగా అద్దం పట్టినట్టు కనిపిస్తుంది. పెద్దలను అవహేళన చేయటమే ఇప్పుడూ జరుగుతున్నది. ప్రాజ్ఞులైన వారి మాట ఎవరూ పాటించటంలేదు. దేనిమీదా లక్ష్యం లేదెవరికీ. జీవితమంటే ఒక ఆట అయింది ప్రతివాడికీ. ఇలాటి నిర్లక్ష్య జీవితానికి ఫలం మనకీనాడు శాస్త్రజ్ఞులు తయారుచేసిన మారుణాయుధ సామగ్రి. ఇదే ముసలం

Page 400

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు