#


Index

భాగవతము - సందేశసారము

  సదాలోచనా సత్ప్రవర్తానా లోపిస్తే ఆయుర్దాయం క్షీణిస్తుంది. ఆయువు క్షీణిస్తే బలక్షయమవుతుంది. బలం పోతే కళే మారిపోతుంది. దానితో నానావ్యాధులూ సంక్రమిస్తాయి. వ్యాధి పీడితులైతే గాని విరక్తి జన్మించదు. విరక్తి కలిగినప్పుడే తానెవడో తన జీవిత గమ్యమేమిటో అన్వేషణ బయలుదేరుతుంది. అది వెంటనే ధర్మంవైపు బుద్ధి మళ్లిస్తుంది. ఇలా అధర్మం పరాకాష్ఠ చేరితేగాని ధర్మాభిరుచి కలిగి జాతి మరలా కృతయుగాన్ని కండ్ల జూడదు.

  ఒక అతీంద్రియ రహస్యముంది ఇందులో మనం గమనించవలసింది. సృష్టికర్త ఏదిగాని నిష్ప్రయోజనంగా సృష్టించడు. అలా నిరర్థకంగా సృష్టించాడంటే అది ఆయన సర్వజ్ఞతకే లోపం. పిపీలిక మొదలు బ్రహ్మదాకా ప్రతి ఒక్కదానికీ ఏదో ఒక ప్రయోజనముంటుంది. అది సాధించటానికే దాని సృష్టి ఉదాహరణ కొక గుఱ్ఱాన్నే తీసుకొని చూతాము. గుఱ్ఱమనేది గాడిద జాతే. దాని మాదిరే ఉంటుందిదీ. అయితే దానితో సరిపుచ్చుకోవచ్చు గదా. మరలా ఈ అశ్వజాతి ఎందుకు సృష్టి అయినట్టు. దానికంటే విశిష్టమైన ప్రయోజనముంది దీనికి. ఇది బండికి కడితే లాగుతుంది. సవారీకి పనికి వస్తుంది. ఆట నేర్పితే నేర్చుకొంటుంది. పందానికికూడా నిలుస్తుంది. మరి ఇలాటి గుణాలు లేవు గాడిదకు. దానికున్న గుణం వేరు. బరువులు మోయటానికి మాత్రమే అది. ఇది అంతకు మించిన కార్యాలు చేస్తున్నది. అయితే అలా చేస్తేనే దాని సృష్టి సార్ధకం. చేయటానికి బద్ధకించినా పాలుమాలినా ఇక అది గుఱ్ఱమే కాదు. గాడిద స్థాయికి దిగజారుతుందది.

  అలాగే ప్రస్తుత మీ మానవ సృష్టి కూడా ఒకానొక విశిష్ట ప్రయోజనం కోసమేర్పడింది. ఏమిటా ప్రయోజనం. జీవిత సత్యాన్వేషణ. అది ఇక ఏ ప్రాణీ చేసే వ్యవహారం కాదు. మానవుడే చేయవలసింది. అందుకు తగిన మనసనే పరికరం కూడా అతని కొక్కడికే ఏర్పడింది. దాని బలంతో ఏది హేయమేది ఉపాదేయమని గుర్తించి హేయమైన అసత్ప్రపంచాన్ని వదలి ఉపాదేయమైన ఆ పరమాత్మ స్వరూపాన్నే పట్టుకోవాలి మానవుడు. అప్పుడే వాడి జీవితం సార్ధకమవుతుంది. అలా కాక తన ధర్మాన్ని విడనాడి పశుపక్షి మృగధర్మాన్నీ అంతకన్నా నీచమైన పైశాచిక ధర్మాన్నీ ఎప్పుడు పాటిస్తాడో, అప్పుడే ఈ మానవ జాతికి వినాశం. మానవుడికి స్వధర్మమైన తత్త్వాన్వేషణలో నిధనం సంభవించినా పరవాలేదు. మరుజన్మలోనైనా కడతేరుతాడు.

Page 399

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు