#


Index

భాగవత ప్రాశస్త్యము

  దీనిని బట్టి భాగవతం వ్యాసరచిత మవునా కాదా అని తదులు సందేహిస్తున్నా రంటే అందులో కొంత సబబు లేకపోలేదు. అష్టాదశ పురాణాలలో విష్ణు పురాణ మెలాగూ అంతర్గతమయి ఉంది. పోతే వివాద గ్రస్తమైన భాగవతాన్ని పద్దెనిమిదవదిగా పరిగణించే దానికంటే నిర్వివాదమైన హరివంశాన్నే తీసుకొంటే సరిపోతుంది. దానినే భాగవతమని వ్యవహరించవచ్చు. వాస్తవానికది భాగవతమే సందేహంలేదు. అయితే ప్రస్తుతం మనకు కనిపించే ఈ భాగవతమేమిటి. ఇది వైయాసికం కాకపోతే మరెక్కడి నుంచి ఊడిపడిందని ప్రశ్న. ఇది వైష్ణవ మతం బాగా బలం పుంజుకొన్న రోజుల్లో విష్ణు భక్తి దేశంలో నలుగురికీ ప్రచారం చేయాలనే దృష్టితో ఎవరో వీరవైష్ణవుడు రచించిన గ్రంథమని పేర్కొంటారు. వోపదేవుడనే ఒక మహా భాగవతుడూ మహా విద్వాంసుడు మహాకవీ ఉండేవాడని ఆయన గారే ఈ భాగవతాన్ని రచించి దానికి లోకంలో ప్రసిద్ధి రావాలని వ్యాస భగవానుడి పేరు పెట్టాడని - చాలామంది విమర్శకుల అభిప్రాయం. కొంత వరకిది వాస్తవమే కావచ్చు. అతడు వంగ దేశస్థుడే అయితే మహాభాగవతులలో కూడా కృష్ణ చైతన్య తత్త్వంలో బాగా పండిపోయి ఉంటాడు. దీని కుపోద్భలకంగా భాగవతం శివ చతుర్ముఖాదులను తగ్గించి విష్ణుపారమ్యాన్నే ఎక్కువగా చాటటం అందులోనూ కృష్ణావతార తత్త్వాన్ని సర్వోత్కృష్టంగా నిరూపించటం గమనించదగ్గ విషయం.

  ఇంత ఆధునికం గనుకనే నేమో అసలు శంకర భగవత్పాదులు పురాణ వాక్యాల నుదాహరించవలసిన చోట్ల నెల్లా విష్ణుపురాణాదులలో శ్లోకాలనే ప్రమాణంగా ఉదహరిస్తారు గాని మచ్చుకైనా ఒక భాగవత శ్లోకాన్ని పేర్కొనలేదు. ఆ కాలానికిది లేకపోవటం వల్లనైనా కావచ్చు. లేక దానిలో శ్రుతి స్మృతి సిద్ధాంతాలకు విరుద్ధమైన సందర్భాలు కొన్ని అక్కడక్కడా దొర్లటం వల్లనైనా కావచ్చు. ఏది ఏమైతేనేమి మొత్తానికి భాగవతం ప్రామాణ్య విషయం చాలా వివాదా స్పదంగా కనిపిస్తుంది. ఇలాంటి వివాదానికి హరివంశ విష్ణు పురాణాలలో మాత్రం కొంచెమైనా ఆస్కారం లేదు. కాబట్టి దీనికన్నా అవే మనకు ప్రామాణికమైన పురాణాలు. దీనిని విడిచిపెట్టి చూచినా వాటితో కలిపి అష్టాదశమనే పురాణసంఖ్య సరిపోతుంది.

  అయితే అలాంటప్పుడు మన మీ భాగవతాన్ని పట్టుకొని వ్రేలాడటం దేనికి. విష్ణు పురాణాదులనే భాగవతంగా పరిగణించి వాటినే విమర్శ చేయవచ్చు గదా

Page 40

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు