కనిపిస్తుంది. శ్లోకాన్వయం కూడా అంత సుకరంగా ఉన్నట్టు తోచదు. శ్లోకాలు అనుష్టుప్పు దగ్గరి నుంచీ శార్దూల వృత్తాలదాకా ఎన్నో రీతులలో నడుస్తూ పోతాయి. అక్కడక్కడ వాడిన గద్య ఏ కావ్యాలలోనూ కానరాదు. ఒక్కమాటలో చెబితే తక్కిన పురాణాలకూ దీనికీ రచనలో మూడు వంతులసలు సాజాత్యమే లేదని చెప్పవచ్చు.
భాషాశైలిలోనే గాదు ఇలాంటి వైపరీత్యం. ప్రతిపాద్యమైన విషయంలో కూడా అక్కడక్కడా వైరుద్ధ్యం గోచరిస్తుంది. ఒకటి రెండుదాహరణ లిస్తాను. బుద్ధుడు వ్యాసుని తరువాత వచ్చిన వాడు. చారిత్రకంగా వారిద్దరికీ ఎలాటి సంబంధమూ లేదు. అలాటి బుద్ధుడు ఒక అవతారంగా భావించి వర్ణిస్తుంది భాగవతం. వ్యాసుడే భాగవత కర్త అయితే ఇలా జరగటానికి లేదు. దీనిని సమర్ధించటాని కీబుద్ధుడు గాక మరొక బుద్ధుడున్నాడు. రాక్షస సంహారం కోసం వారి భార్యల పాతివ్రత్యాన్ని దోచుకొన్న బుద్ధుడాయన. ఆయన కేవలం విష్ణ్వంశజాతుడని వాదిస్తారు కొందరు. అది ఉన్న దాన్ని సమర్ధించే ప్రయత్నమే గాని మరేదీ గాదు. బుద్ధావతార మనేది లేదసలు. గౌతమ బుద్ధుడే బుద్ధుడు. నాస్తిక మతాన్ని ప్రచారం చేసిన వాడతడే. మనవారు భావించే అవతార పురుషుడైన బుద్ధుడు కూడా నాస్తిక మతప్రచారం లోకంలో చేయటానికవతరించినట్టు చెబుతున్నది భాగవతం. ఇదివిష్ణు పురాణ హరి వంశాలలో లేని వృత్తాంతం.
పోతే మరొక విషయమేమంటే కపిలుడనే వాడు సాంఖ్య మతప్రవర్తకు డొకడున్నాడు. భగవదవతారమైన కపిలుడొకడున్నాడు. సగర పుత్రులను భస్మం చేసిన వాడితడే. ఇతడతడు కాదు. అతడు కేవలమొక దార్శనికుడైన ఆచార్యుడు. అతని సాంఖ్యదర్శనాన్ని నిర్మొగమాటంగా ఖండిస్తాడు వ్యాసుడు తన భారతంలో. అలాంటి కపిలాచార్యుణ్ణి మరలా అతడెలా నెత్తిన పెట్టుకొని ప్రశంసిస్తాడు. కాని అలా ఎంతో ప్రశంస చేసినట్టు కనిపిస్తుంది భాగవతంలో. కపిల దేవహూతి సంవాదమంతా సాంఖ్య మత ప్రశసంనమే. ఒకే వ్యాసుడు భారతంలో ఒక మాటా భాగవతంలో ఒక మాటా ఎలా చెప్పగలడు. పైగా ఈ మతాచార్యుడికీ అవతారమూర్తికీ ఏమీ భేదం లేదన్న అభిప్రాయమిస్తుంది మనకు భాగవతం. ఇలా విషయ కోటిలో కూడా ఎంతో వైరుద్ధ్యం కనిపిస్తుంది భాగవతంలో. ఇలాటి వైరుధ్యం హరి వంశంలో మనకు తారసిల్లదు.
Page 39