#


Index

భాగవతము - సందేశసారము

ద్వంద్వాలవి. మంచీ చెడ్డా, పుణ్యం పాపం, సుఖం దుఃఖం, నిత్యమనిత్యమనే ద్వంద్వాలలో ఏది ఉపాదేయమేది హేయమనే వివేచన దుష్కరమయింది మానవులకు. కారణం సత్యమూ తపస్సూ రెండూ లోపించటమే. రెండూ లోపించే సరికి స్వయంగా దర్శించలేడు. ఆలోచన చేసి తెలుసుకోలేడు. ఇక ఎలాగ. దానమూ దయా ఇవి రెండే శరణ్యం. ఇందులో దానమనేది ప్రధానమయిందీ ద్వాపరానికి. ఎవరికో ఒకరికేదైనా తమకున్నది దానం చేసి సంపాదించాలి విద్యా వినయ వివేకాదులు. అది భక్తిగాని శుశ్రూషగాని వస్తు వాహనాది వితరణగాని ఏదైనా కావచ్చు. త్యాగబుద్ధి ప్రధానం. దానివల్ల లోటు భర్తీ చేసుకోలసి ఉంది మానవుడు. ఇది ద్వాపరయుగ లక్షణం.

  పోతే అంతకన్నా దిగజారిపోయింది ఈ కలియుగం. ఇందులో ఒకటిగాదు, రెండుగాదు, మూడు పాదాలు లోపించాయి. సత్యం లేదు, తపస్సు లేదు, దానం లేదు. అంటే మానవుడికి స్వతహాగా స్ఫురించదు ఆలోచించి తెలుసుకోలేడు. ఒకరికి శుశ్రూష చేసి తెలుసుకోవాలనే బుద్ధి లేదు. మరి ఇక ఏమున్నట్టు. మీను మీసంలాగా దయ అనే పాదమొక్కటే శేషించింది. దయ అంటే అయ్యో పాపం, వాడూ మనలాటి వాడేగదా అనే భావం. ఈ భావమున్నంతవరకూ ఒకరికి హాని చేయబోడు మానవుడు. మానవులకే గాదు ఏ ప్రాణికీ చేయలేడు. భూతకోటినంతా సానుభూతిగా చూడగలడు. ఇది కలియుగారంభంలో బాగా ఉంటూ వచ్చింది. రాను రాను ఆ భావం గూడా అంతకంతకూ సన్నగిల్లి ఇప్పుడు గిల్లితే వెళ్లి వస్తుంది కర్కోటకత్వం. అది పరస్పర విద్వేషాలకూ కలహాలకూ దారి తీస్తుంది. ఇదే ప్రస్తుతం మనమందరమూ చూచే ఈ కలికాలం. కలి అనే పేరు దీనికిప్పుడు సార్ధకం. కలి అంటే కలహమని గదా అర్ధం. కలహమే ఎక్కడ పట్టినా తాండవిస్తున్న దిప్పుడు ప్రపంచంలో.

  దీని ఫలితంగా మనకిప్పుడు తారసిల్లిన మహోపద్రవమేమిటి. సుఖం లేదు. శాంతి లేదు. విజ్ఞాన వైరాగ్యాల వల్ల గదా సుఖశాంతులని చెప్పాము. అవి ఎప్పుడు కరువయ్యాయో వీటికీ అప్పుడే నోచుకోలేదు మనం. అన్నివిధాలా భ్రష్టమయి పోయింది మానవజాతి. మానసికంగా భ్రష్టులమయితేచాలు. అదే మాటలలో చేతలో కూడా తొంగి చూస్తుంది. అన్ని అనర్ధాలకూ మూలం మనస్సు. ఈ మనస్సే నేమి. నేమి అంటే చక్రం. మనోమయమైన చక్రాన్ని దొర్లించాడట ఆపరమేష్ఠి. అది వచ్చి

Page 390

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు