#


Index

భాగవతము - సందేశసారము

ఏమిటి. “శ్వవిడ్వరా హోష్ట్ర ఖరైః సంస్తుతః పురుషః పశుః” ఖర వరాహ సూకరాదులతో సమానుడే అవుతాడు మానవుడు. అలా కాక మానవుడు మానవుడనిపించు కోవాలంటే మాత్రం “సవై పుంసాం పరో ధర్మో - యతో భక్తి రధోక్షజే” పరమాత్మ విషయికమైన భక్తి ఒక్కటే అనుసరించవలసిన పరమధర్మం.

  ఇదీ పరీక్షిత్తుకు శుకుడు బోధించిన విషయం. పరీక్షరత్తనేది ఒక నెపమని చెప్పాము. పరీక్షాశీలుడైన మానవుడు ప్రతివాడికీ చెప్పవలసిన మాట ఇదే. అతడు చేయవలసిందీ ఇదే. మనం చేయవలసినవెన్నో ఉన్నాయి. తెలుసుకోవలసినవెన్నో ఉన్నాయి. అన్నిటినీ కలిపినాలుగే నాలుగు వర్గాలుగా విభజించారు మన ప్రాచీనులు. అవే ధర్మార్ధ కామ మోక్షాలు. ఇందులో మధ్యలో ఉన్న అర్ధకామాలు రెండూ మనకా జన్మసిద్ధమే. వాటికోసం ప్రయత్నమక్కరలేదు. పశుపక్ష్యాదులకూ మనకు సమానమే అవి. అంచేత వాటిని పాటించినంత మాత్రాన మనం మానవులమనిపించుకోలేము. పోతే ధర్మబద్ధంగా అవి సేవించినపుడే మానవుడికి విశిష్టత. ధర్మమనేది అర్ధకామాలను నియమించి మానవుణ్ణి అనర్ధం నుంచి కాపాడుతుంది. అనులోమంగా అభ్యుదయాన్ని ప్రసాదిస్తుంది. అయితే అదీ సాపేక్షమే. జనన మరణాద్యనర్ధాల నుంచి మాత్రం మనలను రక్షించలేదది. అంచేత దాన్ని కూడా మించిన పరమధర్మమేదో దాన్ని ఆశ్రయించాలి మానవుడు. అదే మోక్షమనే నాలుగవది. ఇది చరమమైన పురుషార్ధం. పరమమైన ధర్మం. భాగవత ధర్మమనేది ఇదే. దీనిలో జీవజగదీశ్వరులనే భేదవార్త లేదు. అంతా కలిసి ఆత్మస్వరూపంగా ఏకమై భాసిస్తూ అది అపరోక్షంగానే మానవుడి అనుభవానికి వస్తుంది. ఈ అనుభవమే విజ్ఞానం. దీనికి విజాతీయమైన విషయ ప్రపంచమేదీ లేదు కాబట్టి ఇదే వైరాగ్యం. ఇలాటి విజ్ఞానవైరాగ్య వివక్ష కోసమే భాగవత పురాణమవతరించింది. తత్తత్కథా వ్యాజంతో లోకానికీ మహోన్నతమైన సందేశాన్నే అందజేస్తున్నది.

  ఈ సందేశాన్ని అందజేయటంతో పురాణ కర్తవ్యం తీరిపోయినా దీన్ని అందుకొని పాలించనంత వరకూ మానవుడి కర్తవ్యం తీరదు. "ధర్మం చర" అని గదా వేదానుశాసనం. ఆచరిస్తేనే అది ధర్మం. ఆచరణ వదిలేసి ఊరక దానిని గూర్చి మాటలు చెబితే అది ధర్మం కాదు. అది మనకు ఫలితమివ్వదు. మామూలు వైదిక ధర్మమే ఇవ్వకపోతే ఇక అన్నిటికన్నా పరమమైన భాగవత ధర్మమిస్తుందా.

Page 388

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు