భావించ నక్కరలేదు మనం. “విభూతి రేషా నతు పారమార్థ్య" మని భాగవతకారుడే చెబుతున్నాడు. ఇదంతా కవి వాగ్విలాసమే. యథార్థంకాదు. మరి యథార్థమేమి టంటారు. “విజ్ఞాన వైరాగ్య వివక్షయా” అంటాడు. విజ్ఞాన వైరాగ్యాలు మనకు నేర్పటానికే ఈ కథలు. విజ్ఞానమేమిటి. వైరాగ్యమేమిటి. జీవిత గమ్యమైన ఆ సత్యాన్ని తెలుసుకోవటమే విజ్ఞానం. పోతే దానికి వ్యతిరిక్తమైన సమస్త ప్రపంచాన్నీ అసత్కల్పమని భావించటమే వైరాగ్యం. నిజానికి కనిపించే అండ పిండాత్మకమైన సృష్టి అంతా దానిపాటికది అసత్తే. ఆత్మచైతన్య దృష్ట్యా చూస్తేనే అది సత్తు. అప్పుడది భగవద్విభూతిగా దర్శించటమే నిజమైన వైరాగ్యం. అలా దర్శించే కొద్దీ స్వరూప విభూతులు రెండూ ఒకే ఒక ఆత్మ చైతన్యమనే నాణానికి బొమ్మ బొరుసులుగా అనుభవానికి వస్తాయి. ఇలాంటి లోకోత్తరమైన అనుభవమే మానవులుగా మనం ఆర్జించవలసిన విజ్ఞాన ధనం.
ఇదే మనకు పరీక్షిచ్చుక ప్రశ్నోత్తర వ్యాజంతో భాగవత పురాణం చాటి చెబుతున్నది. పరీక్షిత్తు మొదటనే అడుగుతాడు శుకమహర్షిని.
పురుష స్యేహ యత్కార్యమ్ - మ్రియ మాణుష్య సర్వదా
యచ్ఛోతవ్య మథో జాప్యం - యత్కర్తవ్యమ్ నృభిః ప్రభో
స్మర్తవ్యం భజనీయం వా బ్రూహి యద్వా విపర్యయమ్
మహాత్మా మర్త్యుడై పుట్టిన ప్రతి ఒక్కడూ ఎప్పుడో ఒకప్పుడు మరణించక తప్పదు. అలాంటప్పుడీ బ్రతికిన నాలుగు రోజులే మానవుడి కవకాశం. ఇందులో మనం చేయవలసిన కార్యమేమిటంటారు. ఏమి చేయాలి మనం. ఏదైనా జపించాలా, తపించాలా, స్మరించాలా, భజించాలా. ఇవన్నీ కాక ఇంకేదైనా ఉందా. ఏది చేస్తే మన ఈ జీవిత సమస్యకు పరిష్కారమో సెలవీయండి స్వామీ అని ప్రాధేయపడతాడు. దానికా మహర్షి ఇచ్చిన సమాధానం చూడండి ఎలాంటిదో.
వరీయా నేషతే ప్రశ్నః కృతో లోక హితో నృప ఆత్మవిత్సమ్మతాం పుంసాం - శ్రోతవ్యాదిషు యః పరః
రాజా ! నీవు నన్ను వేసిన ప్రశ్న చాలా గొప్ప ప్రశ్న. ఆత్మవేత్తలందరూ అభినందించే ప్రశ్న ఇది. లోకులందరి హితం కోరి అడిగావు నన్ను.
Page 386