#


Index

భాగవతము - సందేశసారము

లేడు. నేనే. అదీ సకల మంత్రాలకూ సారభూతమైన మూల మంత్రం. “ఏవమ్ సమీక్ష న్నాత్మాన మాత్మన్యాధాయ నిష్కలే” అలా నిరంతరమూ తనలో తాను సాధకుడు పరామర్శించుకొంటూ ఎక్కడి కక్కడ ఈ విషయ జగత్తునంతా తన స్వరూపంలో ప్రవిలాపనం చేసుకోవాలి. అలా చేసుకోగలిగితే అప్పుడిక తక్షకుడు లేడు. కాటు వేయటమూ లేదు. చావటమూ లేదు.

  ఇది ఒక పరీక్షిత్తుకే గాదు. మనకు కూడా చెప్పిన మాట. పరీక్షిత్తనేది ఒక నెపం. పరీక్షించే స్వభావమున్న మధ్యమాధికారులంతా పరీక్షిత్తులే. మరీ మందులమూ, అంతిమందులమూ కాము కాబట్టి అంతో ఇంతో మన కాస్తిక్య బుద్ధి అనేది ఏర్పడింది జీవితంలో. అందుకే మనం నాస్తికులమూ హేతువాదులమూ గాక ఆ ఊబిలో పడకుండా తప్పించుకొని విష్ణురాతుల మనిపించుకొన్నాము. అంటే ఎక్కడో ఉన్నదొక భగవత్తత్త్వం, అది ఈ సృష్టికంతా ఆధారభూతం, దానివల్లనే సమస్తమూ నడుస్తున్నది, మనమూ మన జీవితాలూ ఆ ఇరుసుమీద తిరిగే చక్రాలేనని నమ్ముతున్నాము. అయితే ఇదే పరమార్ధం కాదు. ఇంతకన్నా పై స్థాయి అయిన అభేద దృష్టి నలవరచుకోవాలి మనం. అలవరచుకోవాలంటే ఏ శుకమహర్షి లాంటి ఆచార్య పురుషుడో దొరకాలి. అతడుపదేశించే ఏ భాగవత పురాణంలాంటిదో శ్రవణం చేయాలి. అది క్రమంగా మననమై ధ్యానమై అనన్యమైన దృష్టి నిస్తే ఇప్పుడు చెప్పిన మూలమంత్రం ఒంటబట్టి మనకూ లేడు తక్షకుడు. అతడు కాటు వేయటమూ లేదు. మరణించటమూ లేదు. తక్షకుడంటే ఎవడు. కాలమే గదా తక్షకుడని చెప్పాము. కాలమే మనలను కాటువేసే దెప్పటికైనా దానివల్లనే మనకెప్పటికైనా మరణం. మరి కాలమంటే ఏమిటి. మార్పు. ఒక దశ మారిపోయి మరొక దశ రావటమే గదా కాలం. ఒకే బ్రహ్మాకార వృత్తిలో పాదుకొని పోయిన సాధకుడి దృష్టి కిక మారేదేముంది. అప్పుడు మరణమనే మాట కర్ధమే లేదు. అదే అమృతత్వ రూపమైన మోక్షం. అదే జీవిత పరమార్ధం. భాగవత సత్యం. దాన్ని చేర్చేదే భాగవత ధర్మం.

  ఈ ధర్మాన్ని అవలంబించి ఆ సత్యాన్ని చేరండని మనకు బోధించటానికే భాగవతమవతరించింది. ఇవి రెండు చాటి చెప్పటమే అది మనకిచ్చే సందేశం. అందుకోస మల్లిన అల్లికలే ఆయా కథలన్నీ. అవన్నీ పన్నెండు స్కంధాల్లోనూ మర్రి ఊడలలాగా దిగి వేళ్లు పాతుకొని ఉన్నాయి. కథలన్నీ యథార్ధంగానే జరిగాయని

Page 385

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు