#


Index

భాగవతము - సందేశసారము

అయితే అది పరమ సత్యమయినట్టే ఇది పరమ ధర్మం. దీనికే భాగవత ధర్మమని మరొకపేరు. ఇది మామూలుగా మనమనుకొనే మిగతా శాస్త్రాలు చెప్పే ధర్మం లాంటిది గాదు. ఆ ధర్మానికున్నట్టు దీనికి విధి నిషేధాలుగాని నియమ నిబంధనలు గాని లేవు. దీనికున్న నియమమల్లా ఒక్కటే. అది పరమాత్మ దృష్టి. దీనికున్న నిషేధమల్లా ఒక్కటే. అది తదితరమైన దృష్టి వదలుకోటం. అలా వదలుకొంటూ పోతే ఆ సాధకుడి జీవితమంతా ఇక పరమాత్మైక పరాయణమే అయిపోతుంది.

  అయితే అయిపోవటం వరకూ విప్రత్తి పత్తి లేదు గాని ఆ అయిపోవటంలో ద్రుతవిలంబ గతిభేదమనేది మాత్రముంటుంది. ఒకటి వెంటనే పరిపక్వమై భగవత్సాయుజ్యాన్ని ప్రసాదిస్తే మరొకటి అలాటి పరిపాకానికి రావటానికి కొంత కాలం పడుతుంది. అందుకు కారణం సాధకుల ప్రవృత్తిలో ఉన్న తారతమ్యమే. “యే యథామాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహమ్” అని గదా భగవానుడి హెచ్చరిక. ఎవరే దృష్టితో సమీపిస్తే వారిని దాని కనుగుణంగానే అనుగ్రహిస్తాడాయన. తత్త్వమనేది ఒకటేనని గదా చెప్పారు. మరి ఈ తారతమ్యమెందు కేర్పడినట్టు. ఇది తత్త్వంలో ఏర్పడింది కాదు. తత్త్వాన్ని దర్శించే సాధకుల దృష్టిలో ఏర్పడింది. ఒకరు సగుణంగా చూస్తే మరొకరు దాన్ని నిర్గుణంగా దర్శిస్తారు. ఎందుకంటే తత్త్వమెప్పుడూ నిర్గుణం నిరుపాధికం. ఒక్కసారి అలా నిరుపాధికంగా దర్శించలేని భక్తులు దానికి నామరూపాది గుణాలు ఆరోపించి దర్శిస్తారు. అది పరిపూమైన తత్త్వస్వరూపం కాదు. తత్త్వవిభూతి అది. ఇలాటి విభూతులే భగవదవతారాలు. సగుణ భక్తుల ననుగ్రహించటానికే అవి లోకంలో ఆవిర్భవించాయి. వారి భక్తి కడ్డు తగిలే దుష్టశక్తులను శిక్షించటమూ వారి సాధాన మార్గాన్ని రక్షించటమూ ఇవి రెండూ వాటి ఉద్యోగం.

  ఈ సగుణ మార్గంలోని అవాంతర భేదాలే కర్మ, సమాధి, భక్తి శాఖలు మూడూ. ఈ మూడింటిలోనూ తామారాధించే భగవత్తత్త్వం వేరూ తాము వేరూ ననే కించిద్భేద దృష్టి వెంటాడుతుంటుంది భాగవతులను. అలాటివారే అంబరీషాదుల దగ్గరినుంచీ జడభరతాదుల దగ్గరి నుంచీ ఉద్దవాదుల వరకూ ఉన్న భక్త కోటి అంతా. అయితే వీరు మొదట మొదట ఇలా భేదదృష్టితో జీవితం సాగించినా జీవితాంతంలో క్రమంగా భేదదృష్టి వదలుకొని అభేద దృష్టి నలవరచుకొని భగవదైక్యం పొందగలిగారు

Page 383

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు