14. భాగవతము - సందేశసారము
మనమింతవరకూ భాగవత మహాపురాణాన్ని గూర్చి చాలా విపులమైన సమీక్ష గావించాము. అందులో భగవతతత్త్వాన్ని గూర్చీ భాగవతుల జీవితాన్ని గూర్చీ కూడా చర్చించాము. భాగవతమంటే అసలు భగవంతుడి చరిత్రేగాక భగవద్భక్తుల తాలూకు చరిత్ర కూడా నని గదా పేర్కొన్నాము. ఒకటి పైనుంచి క్రిందికి చూడటమైతే మరొకటి క్రింది నుంచి పైకి చూడటం. మొదటిది భగవంతుడవతరించటం రెండవది భాగవతుడైన మానవుడు తరించటం. ఆమాటకు వస్తే భగవంతు డవతరించాడని చెప్పడం కూడా ఒక కల్పనే. జీవుడు సాధనచేసి తరించాడని చెప్పటం వరకే సత్యం. దానికి దైవానుగ్రహం కూడా తోడు పడాలి కాబట్టి దానికొక ఆలంబనంగా భావించి చెప్పిందే భగవదవతారాలనేవి. అప్పటికొక విధంగా చూస్తే భగవచ్చరిత్ర కూడా కాదిది వాస్తవానికి. అంతా భాగవతులైన భక్తుల చరిత్రే. చిత్ర విచిత్రమైన మార్గాలలో నడచిన వారి జీవిత చరిత్రల సంపుటీకరణమే ఈ పురాణమంతా.
అయితే ఎన్ని విభిన్న మార్గాలలో ఎవరు తమ సాధన కొనసాగించినా చివరకు చేరిన గమ్యం మాత్రమొక్కటే. దానినే పరమ సత్యమని పేర్కొన్నది భాగవతం. అంతేకాదు.
వదంతి తత్తత్త్వ విదః - తత్త్వమ్ యద్ జ్ఞాన మవ్యయమ్ బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి చోచ్యతే
అదే తత్త్వం - అదే జ్ఞానం, అదే పరమాత్మ, అదే బ్రహ్మం, అదే భగవంతుడని కూడా అనేక సంజ్ఞలతో నిర్దేశిస్తున్నది. ఇలాంటి సర్వాత్మభావానికే మోక్షమని కూడా పేరు. పరమాత్మకూ మోక్షానికీ తేడా లేదు వేదాంతంలో. "బ్రహ్మ భావశ్చ మోక్షః” అని భాష్యకారుల నిర్వచనం. ఇదే మానవ జీవిత పరమార్ధం. ఏకైక గమ్యం. ఈ గమ్యాని కభిముఖంగా సాగించవలసిందే ఎవరు సాగించినా తమ పయనం.
ఇదుగో ఈ సాగించే పయనమూ లేదా సాధన మార్గానికే ధర్మమని పేరు పెట్టింది భాగవతం. గమ్యం సత్యమైతే దానికి గమనమైన ఈ సాధన ధర్మం
Page 382