కాంతోపల సౌధాలే గాదు. మానిత కూజితో ద్యానాలే గాదు కల్హార కైరవోల్లసిత కాసారాలే గాదు. దాస దాసీ జనాలే గాదు. అంతా అయోమయమై పోయిందా బాపడికి. ఎప్పుడూ కనివిని ఎఱిగింది కాదా వైభవం. ఏ పుణ్యాత్ముడి భవనమో అనుకొన్నాడు. చూడండి ఈ మాట. అప్పటికీ తనదనే భావంగాని అయితే బాగుండుననే ఆశగాని లేదాయనకు. సమదర్శి అయిన జ్ఞాని లక్షణమే అంత. అలా క్షణకాలం చూస్తూ నిలబడ్డాడో లేదో. అంతలోనే అప్సరసల వంటి కాంతలు కొందరు నృత్తగీత వాద్యాలతో ఎదురు వచ్చి సగౌరవంగా లోనికి తీసుకెళ్లారట. అప్పటికే తన పతి రాకకై వేయి కన్నులతో ఎదురు చూస్తూ వేచి ఉన్న ఆయన ధర్మపత్ని లేచి వచ్చి ఆనంద భాష్పాలతో ఆయన పాదాల కభిషేకం చేసి భావంలోనే గాఢాలింగనం చేసుకొంటుంది. అదంతా చూచి అప్పటి కర్ధం చేసుకొంటాడా మహాత్ముడిదంతా తన బాలసఖుడి లీలా విశేషమని. ఆహా ! కృష్ణుడంటే కృష్ణుడు కాదు. ఎంతటి జగన్నాటక సూత్రధారి ఆ జగన్మోహనుడు. "ఎన్న క్రొత్తలైన యిట్టి సంపదలు నా కబ్బు టెల్లహరి దయావలోకనమున గాదె”
ననునా వృత్తాంతంబును-దన మనమున గనియు నేమి దడవక నను బొమ్మని యీ సంపద లెల్లను నొనర గనొడ గూర్చి నన్ను నొడయని జేసెన్
కుచేలుడి ఈ స్వగతంలో ఉన్నదేమున్నా ఆ జగన్నాటక సూత్రధారి నాటక రహస్యాన్ని భేదించే పాత్రధారి ఈ కుచేలుడు. నాటక ప్రదర్శనమంతా ఇంత కాలమూ మౌనంగా చూస్తూ వచ్చాడు. ఇది ఏమిటా ఎందుకిలా చేశాడా అని అప్పుడప్పు డనుమానం తగిలినా ఎందుకైనా కావచ్చు. అంతవాడు చేసే చేతలలో ఎంతైనా ఉండవచ్చు అర్ధమని అప్పటికప్పుడు తన మనసుకు సమాధానం చెప్పుకొంటూ వచ్చాడా మహాభక్తుడు. ఆఖరుకు ఇంటికి తిరిగి వచ్చే సందర్భంలో అయో వట్టి చేతులతోనే పంపాడే నన్నని సందేహించి కూడా అదీ ఒకందుకు మేలే తన్మూలంగా పరమాత్మ స్మరణనైనా ఏమరకుండ వచ్చుననే భావించాడు. కార్యసిద్ధినీ అసిద్ధినీ ఒకటిగానే భావించాడు. ఇలాటి పరిపూర్ణమైన సమదర్శనమే భక్తికిగాని జ్ఞానానికిగాని పరాకాష్ఠ. మరి బ్రహ్మవేత్తలలో ఉత్తముడని గదా పేర్కొంటూ వచ్చాము కుచేలుణ్ణి
Page 379