#


Index

నిర్గుణ భక్తులు - కుచేలుడు

కనుకనే మరలా తన మనసుకిలా వెంటనే సమాధానం చెప్పుకొంటాడు కుచేలుడు. ఏమని. "ఎన్న దరిద్రుడు సంపదంధుడై కానక తన్ను జేరడని కాక శ్రితార్తి హరుండు సత్కృపాం భోనిధి సర్వవస్తు పరిపూర్ణునిగా ననుజేయకుండునే.” వీడికి కోరినదంతా మనమిచ్చి పంపితే ఆ ఊబిలో బడి పోయి మరలా మన ఊసైనా ఎత్తుతాడో లేదో. వీణ్ణి ఇలా దరిద్రుడు గానే ఉంచటం మంచిది. అనుక్షణమూ మన స్మరణ ఏమరకుండా ఉంటాడనే సదభిప్రాయంతోనే నాకేదీ ఇచ్చి ఉండడు. అలా కాకపోతే అంత దయామయుడూ దీన జన బాంధవుడూ అయిన భగవానుడు నన్నీ పాటికి సకల సంపదలలోనూ ముంచి తేల్చకపోయాడా. ఈ మాటలలో ఉంది కుచేలుడి గొప్పతనం. స్వామి నడగటానికదే పనిగా వచ్చాడు. తన కాయన ఏమీ ఇవ్వలేదు. చేయలేదు. మీదు మిక్కిలి శుష్క వచనాలతో శూన్య హస్తాలతోనే వెనుకకు పంపాడు. అలాంటప్పుడేమో ఇవ్వలేదే అని సందేహించి కూడా అది స్వామి అపరాధం కాదు. తనదేనని చెప్పుకోటమే గొప్ప. జీవుడిలో ఉండే దౌర్బల్యం వల్లనే దేవుడనుగ్రహించలేదనే భావం మహాభాగవతులకు తప్ప మరి సామాన్యుల కెవరికీ మనసుకు రాదు. ఏమిటా జీవగత దౌర్బల్యమని అడగవచ్చు. అదే కుచేలుడిప్పుడే చెప్పాడు అంధత్వమని. సంపదలచేత అంధుడవుతాడు మానవుడు. ఏది దగ్గర చేరితే అదే సంపద. అది చేరేకొద్దీ దానిలోనే కూరుకుపోతాము. కూరుకుపోయే కొద్దీ మరేదీ కనపడదు కంటికి. దానితో అజ్ఞానానికి జ్ఞానమబ్బదు. జ్ఞానికి నిష్ఠ అబ్బదు. అన్ని అనర్ధాలకూ మూలమప్పటికి ధనమదాంధత్వం. అందుకే తెలిసో తెలియకో ఇదే మాట కుంతీదేవి కూడా అన్నది కృష్ణుడితో పూర్వం "అకించన గోచరుడగు నిన్నున్ వినుతింపగనేర”రని. అసలు కుంతి ఏమిటి. ఆవిడ తెలియక అంటే అన్నీ తెలిసిన పరమాత్మే అన్నాడొకచోట ఎవ్వరిని నేననుగ్రహింపదలిస్తే వారి సర్వస్వమూ ముందుగా అపహరిస్తానని. ఇందులో ఆధ్యాత్మికమైన రహస్యమేమంటే ఇది అసత్తు. అది సత్తు. అసత్తును పట్టుకొని కూచున్నంత వరకూ సత్తుకు దూరంగాక తప్పదు. అలాకాక దానికి దగ్గర పడాలంటే అసత్తును వదలుకొని గాని దాన్ని పట్టుకోటానికి లేదు. ఆ వదలటమే దారిద్య్రమనే మాట కర్థం.

  కుచేలుడీ ఉదాత్తమైన భావనతో ఎప్పుడూరు చేరాడో అప్పుడా ఊరే మారిపోయింది. ఇల్లే మారిపోయింది. భానుచంద్ర ప్రభాభాస మాన స్వర్ణ చంద్ర

Page 378

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు