తెచ్చిన అటుకులు కూడా అడిగి పుచ్చుకొని కమ్మగా భక్షించినవాడు. అందుకోసమైనా ఆయన కోరిక తీర్చి పంపవలసి ఉంది. అది అలా ఉంచి ఆ పిడికె డటుకులు తిన్నందుకే ఎంతో మనమాయనకు ఋణపడి ఉన్నామని ఇకతింటే సర్వస్వమూ ఇచ్చుకోవలసి ఉంటుందని రమాదేవి చెప్పనే చెప్పింది. ఏదీ మరి ఆయన ఇచ్చి ఉంటే ఈయన ఇంకా దరిద్రుడననే ఎందుకు భావిస్తున్నాడు. ఇంతకూ ఇచ్చాడా ఆయనకు లేదా. ఇచ్చాడు. ఇచ్చాను పొమ్మని ఇంతకుముందే చెప్పాడు పరమాత్మ. పైకి గాదు తన మనసులో పరమాత్మకా సంకల్పమెప్పుడు కలిగిందో అప్పుడే అబ్బింది కుచేలుడికా లిబ్బి. అయితే ఎందుకిలా గాబరా పడుతున్నాడు. తానింకా ఇంటికి వెళ్లలేదు. చూడలేదు. వెళ్లి చూస్తే తెలిసేది ఆయన ఎంత ఇచ్చాడో ఏమో. దారిలోనే ఉన్నాడాయె. అందుకే గాబరా ఇచ్చాడో లేదో నని.
అయినా ఇందిరాదేవి అప్పుడే చెప్పింది గదా అటుకులు పిడికెడు భక్షించి మరలా పిడికెడందుకొనే సమయంలో ఈయన కిప్పటికే ఎంతో ఐశ్వర్యమిచ్చామని. అది కుచేలుడి సమక్షంలోనే గదా చెప్పిందావిడ. వాస్తవమే. కాని అది కుచేలుడు వినలేదు. కారణ మామె భర్త చెవిలో రహస్యంగా చెప్పిందా మాట. పరమాత్మది మనసులోని సంకల్పం కాబట్టి తెలియలేదు. అమ్మవారిది మాటయినా అది రహస్యంగా చెవిలో చెప్పింది కాబట్టి తెలియలేదు కుచేలుడికి తెలియలేదు గనుకనే చివరకు చందమామ ఘుటిక అయిందే నా బ్రతుకు అని ఈ ఆందోళన. అయితే ఇలాటి ఆందోళన బ్రహ్మవేత్త అయిన వాడి కుండవచ్చునా. ఉండకూడదు వాస్తవానికి. ఎందుకున్నది మరి. ఉపాధి ఉన్న నేరానికని జవాబు. జీవన్ముక్తుడు విదేహముక్తుడి లాంటివాడు కాదు. వాడికింకా శరీరా ద్యుపాధులతో సంపర్కముంది. ఉన్నా తన జ్ఞానబలంతో లేనట్టు మెలగుతుంటాడు. అంతేగాని బొత్తిగా అవి లేవని గాదు. అడపా దడపా జ్ఞానానికి బలం చాలకపోతే అవి మరలా దెబ్బ తీస్తాయి. బలమెందుకు చాలదు. ప్రారబ్ధం వల్ల. జీవన్ముక్తుడికి కూడా ప్రారబ్ధమనే దున్నది గదా. అది కారణంగా బాధితమైనా ఈ సంసార వాసనలను వృత్తమవుతుంటాయి అప్పుడప్పుడూ. అవే లేని పోని అనుమానాలు గాబరాలూ తెచ్చి పెడుతుంటాయి. ప్రస్తుత మీ కుచేలుడి విషయం కూడా అంతే. ద్వారకకు బయలుదేరినప్పుడెంతగా అనుమానించాడో చూచాము గదా. అలాగే ఇప్పుడు మరలా తన విషయంలో ఆందోళన చెందుతున్నాడు. అయితే చెందినా అది తాత్కాలికమే బ్రహ్మవేత్తకు.
Page 377