సమస్త్రైశ్వర్యాలూ ప్రసాదింతును గాక అని సంకల్పిస్తాడట. ఏమిటీ సంకల్పం. భగవత్సంకల్పమనేది అలాగే ఉంటుంది. మానవుడేది కోరితే అది ఇవ్వాలని లేదు భగవానుడికి. వాడు సృష్టికర్త అయిన తన్ను విస్మరించి కేవలం తన సృష్టినే పట్టుకోటం ఇష్టం లేదాయనకు. అలా పట్టుకొనే కొద్దీ తన తత్త్వానికి దూరమైపోతాడు వాడు. అది వాడి వినాశానికే మూలం. జీవుడు సర్వాత్మనా నశించిపోవటం తనకిష్టం కాదు గదా. ఎలాగైనా వాడి నుద్ధరించాలి తాను. అందుకే కుచేలుడైశ్వర్యకాముడైనా తన్ను భజించాలని చెప్పి వాణ్ణి నిష్ఠదరిద్రుడుగా జన్మింపజేశాడు. బహుజన్మార్జితమైన సుకృతమెలాగూ ఉంది కాబట్టి దాని బలంతో ఈ దారిద్ర్యాన్ని కూడా భరించే జ్ఞానముంది అతడికి. దానితో ఎలాగూ భజిస్తాడు తన్ను. జ్ఞానవైరాగ్యాలు రెండూ ఒకదాని కొకటి తోడయినప్పుడిక అదే ఐశ్వర్యం. అది ఇక తాను ఇవ్వనే అక్కరలేదు. అయత్న సిద్ధమిది. అయినా సృష్టిలో ఏది జరిగినా అది ఈశ్వర సంకల్పమే గదా. ఆ భావాన్ని చాటటానికే ఈ సంకల్ప మా పరమాత్మకు కలిగినట్టు వర్ణించటం.
అయిందక్కడికి. అటుకుల ముడివిప్పి ఒక గుప్పెడు భక్షించాడు. రుచిగా ఉన్నవో ఏమో. ఊరక వచ్చినవి రుచిగా ఉండటంలో ఆశ్చర్యమేముంది. బాగున్నాయని చెప్పి మరి ఒక గుప్పెడందుకో బోయాడు. ఇంకా అందుకొన్నాడో లేదో అప్పుడే కనిపెట్టింది ప్రక్కన ఉన్న కమలాలయ. వెంటనే ఆయన చేయిపట్టుకొని అయ్యా “సొంపారగ నితనికి బహుసంపద లందింపనివియ చాలును - నిక భక్షింపగ వలవదు” అని నివారించిందట. ఏమిటిందులో అంతరార్థం. ఆవిడ ఎందుకు నివారించటం. ఆయన ఆరగిస్తే ఈవిడ కెందుకంత ఆరాటం. ఏమీలేదు. ఆ భక్షించినందుకు గాను ఈయనగారా భక్తుడి కెక్కడ లేని ఐశ్వర్యమివ్వవలసి ఉంది. అందులో భక్తుడు లేశమాత్రమిస్తే చాలు దానికి ప్రతిగా హేమాచల తుల్యమైన ఐశ్వర్యమిస్తాడు స్వామి. ఒక్క పిడికిలికే అది ఇప్పుడు ధారాదత్తం. ఇంకా పిడికిళ్లు పిడికిళ్లు బొక్కుతూ కూచున్నాడంటే ఏదీ మిగలకుండా సమస్తమూ ఆ కుచేలుడికే సమర్పణ చేసి కూచోవాలి. చేస్తే ఏమి నష్టం అని అడగవచ్చు. రెండే నష్టాలు. ఒకటి జగత్సృష్టి స్థితి లయాల కొకరుగాక ఇద్దరు కర్తలయి కూచుంటారు. మరొకటి కుచేలుడింతవరకూ సంపద అంటే ఎలాంటిదో ఎఱగని వాడు. ఇప్పుడు క్రొత్తగా చవిచూడబోతున్నాడు. అది ఎంతవరకో అంత వరకైతే పరవాలేదుగాని అపరిమితమైతే
Page 375