నిరవశేషంగా సమర్పణ చేయాలి. ఎవరికి. పరమాత్మకు. పరమాత్మకు దేనికిసమర్పణ చేయటం ఆయన సర్వసంపన్నుడు గదా. దీని అవసరమేమిటాయనకు. మీదు మిక్కిలి జీవుడికే గదా అవసరం. అవసరమున్న జీవులకాయన ఇవ్వాలి గాని ఏ అవసరమూ లేని తాను జీవుల దగ్గర అదీ ఇదీ ఆసించటమేమిటి.
ఇక్కడే ఉందొక గొప్ప రహస్యం. “అత్తా చరాచర గ్రహణాత్” అని శారీరక సూత్రం. అత్త అంటే తినేవాడని అర్ధం. చరాచర సృష్టినంతా భక్షించేవాడు కాబట్టి ఆ పరమాత్మకు అత్త అని పేరు. భక్షించటమంటే తనలో పూర్తిగా లయం చేసుకోటమని అర్థం. అది ఆయనపాటి కాయన ఎప్పుడు చేసుకొనే ఉన్నాడు. చేసుకొని "ఏక మేవా ద్వితీయ" మన్నట్టు ఏకైకరూపంగా నిలిచి ఉన్నాడు. నిత్యముక్తుడాయన. ముక్తికోసమిక ప్రయత్నమక్కరలేదు. అక్కర ఉన్నదల్లా మనబోటి జీవులకే. మనకూ ఆ స్థితి లభించాలంటే ఒక్కటే షరతు. మనలోపలా వెలపలా పరచుకొన్నట్టు చూచే ఈ చరాచర ప్రకృతినంతా ప్రయత్న పూర్వకంగా ఆయనలో లయం చేయాలి. చేస్తే ఆయనా మనమూ అనే తేడా లేదిక. అంతా మన స్వరూపమే. అదే ముక్తీ. ఇదుగో ఇక్కడ లయం చేయటమంటున్నామే. ఇదే సమర్పణ. పత్రం పుష్పం ఫలమనే మాట మాట సామెతగా చెప్పింది. అది మనమున్న యావత్ప్రపంచానికీ ఉపలక్షణం. ఈ మొత్త విషయ జగత్తంతా నని అర్ధం. ఇదంతా ఆయనకే మనం సమర్పించాలి. అంటే ఆ మహాచైతన్యంలో ప్రవిలయం చేయాలి. అంటే ఇదంతా తదాత్మకంగానే భావించాలని అర్ధం.
అయితే మనమే సమర్పిస్తూ పోతే ఇక ఆయన మనకిచ్చేదేమిటి. ఆయన గదా మనకివ్వవలసింది. ఆయన మనకు క్రొత్తగా ఇవ్వవలసినదంటూ ఏమీ లేదు. ఇచ్చే ఉన్నాడా మాటకు వస్తే. ఆత్మరూపంగా ఎప్పుడూ ఉండనే ఉన్నాడు. మనలోపలా వెలపలా ఉన్నది వాస్తవంలో ఆత్మచైతన్యమే. అది మనకు నిత్యసిద్ధం. సిద్ధమని గుర్తించలేక దాన్ని సాధించాలని తాపత్రయపడుతున్నాము. ఎవరో మనకివ్వాలని అఱ్ఱులు చాస్తున్నాము. ఎవరూ ఇవ్వనక్కరలేదు. ఆత్మను గుర్తించకపోయేసరికదే మన పాలిటి కనాత్మగా భాసిస్తున్నది. ఈ అనాత్మ ఒకటి వేరుగా కనిపించటం మూలాన్నే మనకేవేవో కోరికలు. ఈ కోరికలు తీరాలంటే ఈ అనాత్మనంతా ఆ ఆత్మచైతన్యానికే అప్పజెబితే చాలు అంటే ఆత్మగా దర్శిస్తే చాలు. అప్పుడిదీ అదీ
Page 373