#


Index



నిర్గుణ భక్తులు - కుచేలుడు

చూచారా దొంగను పట్టటానికి దొంగే కావాలన్నారు పెద్దలు. కృష్ణుడే దొంగ అనుకొంటే అంతకన్నా దొంగ కుచేలుడు. ఆయన గురువుగా రాశీర్వదించారు గదా సకలైశ్వర్యాలూ సంభవిస్తాయని. మరి నీవు జీవితంలో దరిద్రుడవెలా వయ్యావని అడిగితే ఆ గురువనుగ్రహిస్తే ఏమవుతుందయ్యా ! త్రిజగద్గురుడవైన నీవనుగ్రహించాలి గాని. ఆ నీ అనుగ్రహం లేకనే ఇన్నాళ్లూ కష్టదారిద్య్రమనుభవించాను. అందుకోసమే ఇప్పుడు నీ దర్శనార్థం వచ్చానని ఈయన జవాబు.

  ఇది పైకి తేలకుండా ఇద్దరు మిత్రులూ నర్మగర్భంగానే ఒకరిపై ఒకరు విసురుకొనే వ్యవహారం. కనుకనే కుచేలుడు సాభిప్రాయంగా పలికితే ఆ పలికిన పలుకులు విని సమస్త భావాభిజ్ఞుండైన పుండరీకాక్షుండు మందస్మిత సుందరవద నారవిందుడయినాడట. సమస్త జీవుల భావాలూ చెప్పకుండానే తెలిసినవాడు కుచేలుడి ఈ పలుకులలోని భావం గ్రహించలేడా. గ్రహించే మందహాసం చేశాడు. ఇదుగో ఈ మందహాసమే మహామోసం. ఇది ఇంతకు ముందే ఎంతో మంది భక్తుల విషయంలో చేస్తూ వచ్చాడు. ఇప్పుడూ అదే ఒలకబోస్తున్నాడు. అంటే వీడు నా గుట్టు బయటపెట్టాడే అసాధ్యుడు ఈ కుచేలుడని దానిలోని ఆంతర్యం. అయినా అప్పుడే బయటపడగూడదు తాను. అంత సులభంగా అనుగ్రహించగూడ దాబ్రాహ్మణుణ్ణి. మరికొంత పరీక్షకు గురి చేయాలి. ఏమిటా పరీక్ష. "కుచేలా ! నీవిచ్చటికి వచ్చునప్పుడు నాయందుల భక్తింజేసి నాకు నుపాయనంబుగా నేమి పదార్ధంబు దెచ్చితి వప్పదార్థంబు లేశమాత్రంబైన బదివేలుగా నంగీకరింతు” ఆ పదార్ధమేదో బయటపెట్టమంటాడు.

  చూడండి. ముందుగనే పసిగట్టాడా ధూర్తగోపాలుడు. ఇన్నాళ్లకు సెలవుగా ఇంత దూరం తన్ను వెతుక్కొంటూ వచ్చిన ఆ బ్రాహ్మణుడు కేవలం రిక్తహస్తాలతో రాడు. ఏదో ఒకటి తనకు కానుక పట్టుకువచ్చే ఉంటాడు. అది కూడా తట్లూ పుట్లూ కావు. లేశమాత్రమేనని కూడా తెలుసు నాయనకు. ఒకవేళ అది యత్కించిత్తనే కించతో ఆ బ్రాహ్మణుడు తన కివ్వడేమో నని ముందుగానే హామీ ఇస్తున్నాడు. దానినే నేను పదివేలుగా భావిస్తాను. బయటపెట్టమని లేశమాత్రమంటే మరలా అది ఎలాటి అమూల్యమైన పదార్థలేశమో నని అతడు సందేహించవచ్చు. అలాటి సంకోచం కూడా అతనికి కలగకుండా ఇలా అంటాడు

Page 371

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు