
2. భాగవత ప్రాశస్త్యము
మన వాఙ్మయంలో పురాణాలకున్న స్థానమేమిటో - వాటి విశిష్టత ఏమిటో చర్చించాము. పోతే ప్రస్తుత మీ పురాణాలలో భాగవత పురాణానికున్న ప్రాశస్త్య మెలాంటిదో పరిశీలించవలసి ఉంది. “మద్వయమ్ భద్వయం చైవ - బ్రత్ర యమ్ – వచతుష్టయమ్ – అనాపలింగ కూస్కాని - పురాణాని పృథక్పృథక్” అని మొత్తం పద్దెనిమిది మహా పురాణాలను పరిగణించారు మన ప్రాచీనులు. మద్వయమంటే మత్స్య మార్కండేయాలు. భద్వయమంటే భవిష్య భాగవతాలు. బ్రత్రయమంటే బ్రహ్మ బ్రహ్మాండ బ్రహ్మ వైవర్తాలు. వచతుష్టయ మంటే వరాహ విష్ణు వామన వాయు పురాణాలు. అ అంటే అగ్ని, నా అంటే నారద, ప అంటే పద్మ, లిం అంటే లింగ, గ అంటే గరుడ, కూ అంటే కూర్మ, స్క అంటే స్కంద పురాణాలు. ఈ అష్టాదశ పురాణాలలోనూ భాగవతమనేది చుక్కలలో చంద్రుడిలాగా చాలా ప్రసిద్ధి కెక్కింది. రామాయణ భారతాలు ఇతిహాసాలకైతే పురాణ శాఖ కంతటికీ ఒక్క భాగవతమే ప్రాతినిధ్యం వహించగలదు.
అయితే లోకంలో ఎంత ప్రసిద్ధమైనా విమర్శక లోకంలో మాత్రమింకా దీని విషయంలో కొంత విచికిత్స ఉండనే ఉంది. ఇది మిగతా పురాణాల మాదిరి వ్యాస ప్రోక్తమేనా - లేక మరెవరైనా మహానుభావుడు రచించి ఆయనపేరు పెట్టాడా అని కొందరి అనుమానం. ఈ అనుమానం కూడా కేవలం నిరాధారమైనది గాదు. కొంత లోతుకు దిగి చూస్తే మనకు చాలా ఉపపత్తులు కనిపిస్తాయి. అసలు భాగవతమని నామకరణం చేయటమే చిత్రంగా ఉంది. భాగవతమంటే భగవంతుడి చరిత్ర అని మాత్రమే అర్థం. భగవంతుడి చరిత్ర కాని పురాణమేముందని, అసలు పురాణమంటేనే భగవచ్ఛరిత్ర అని పేర్కొన్నాము. అలాంటప్పుడు భాగవతమని పేరు పెట్టటమే ఒక విధమైన పునరుక్తి. మిగతా పురాణాల విషయమలాకాదు. అందులో ప్రతిపాదించిన విషయాన్ని బట్టి వాటికా పేరు వచ్చింది. అగ్ని వాయు - ఇలాటి వాయా దేవతల చరిత్రలు. వరాహ వామన కూర్మ నారసింహాదు లాయా అవతార
Page 37
బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు