#


Index



నిర్గుణ భక్తులు - కుచేలుడు

గాకపోయినా లోకహితం కోసమని కర్మలాచరిస్తుంటారు. అదీ ఎంతవరకో అంత వరకే. అలా ఆచరించేటప్పుడు కూడా వారికి మిగతా లోకుల కున్నట్టు రాగద్వేషాదులుండబోవు. చూడండి. కుచేలుడి మనస్తత్త్వమేదో బాగా పట్టేశాడు పరమాత్మ. తనలాంటి వాడేనట అతడూ. తానెలా నిర్లిప్తుడూ నిష్కాముడూ అయి కర్మ లాచరిస్తున్నాడో అతడూ అంతే. ఇలా తన స్థాయికి చేర్చి మాటాడాడంటే ఎంత గొప్ప ప్రశంసా పత్రమో ఇది. ధనమున్నా లేకున్నా అప్పటికి కుచేలుడు దరిద్రుడు కాడు. తన మాదిరి సకలార్ధ సంపన్నుడే.

  ఇలా అతని యోగక్షేమాలు విచారణ చేస్తూ చేస్తూ మధ్యలో తమ చిన్ననాటి గురుశుశ్రూషాదులూ, ఆ గురువు గారి మాహాత్మ్యమూ బ్రహ్మాండంగా వర్ణించి చెబుతూ "కుచేలా నీకొక ఉదంతం జ్ఞాపకమున్నదా. ఒకనాడు కట్టెలు లేవని గురుపత్ని మనల నడవికి పంపితే ఉన్నట్టుండి అక్కడ బ్రహ్మాండమైన వర్షం కురిసింది. అంతలో సూర్యుడస్తమించి గాఢాంధకారమలము కొన్నది. బయలు, గొంది - మిఱ్ఱు, పల్లం అని గుర్తు చిక్కని ఆ కటికి చీకటిలో జడివానకు తప్ప తడసి ఒండొరుల చేతులూతగా గడగడ వణుకుతూ ఒక చెట్టుక్రింద కూలబడి ఆ కాళరాత్రి గడిపాము. తెల్లవారగానే మన గురువుగారు సాందీపని మనలను వెదుకుతూ వచ్చి చూచి బిడ్డలారా మా కోసం మీరు ఎంత కష్టాల పాలయి నారురా శిష్యులు తీర్చవలసిన ఋణం తీర్చుకొన్నారు. కాబట్టి మీకిట మీద “విస్ఫుట ధన బంధు దార బహుదార బహు పుత్ర విభూతి జయాయు రున్నతుల్” అన్నీ సమకూరు గాక అని దీవించి తరువాత మనలను మననెలవులకు పొమ్మని వీడ్కొలిపి పంపాడు. నీకిదంతా జ్ఞాపకముంది గదా అని అడుగుతాడు.

  ఏమిటీ కథ ఇప్పుడు ప్రస్తావన చేయటంలో అంతరార్థం. ఎన్నో సంఘటనలు జరిగి ఉండవచ్చు బాల్యంలో. ప్రత్యేకించి ఈ సన్నివేశాన్నే ఎందుకు ప్రస్తావించినట్టు. ఇందులో ఒక గొప్ప చమత్కారముంది. సాందీపని శిష్యులిద్దరినీ దీవించి పంపాడు. ఏమని. మీకు కావలసినంత ధనమూ, బంధు పుత్ర కళత్రాదులూ, ఆయురారోగ్యాలూ, జయాభ్యుదయాలు, కలుగుతాయని గురువు గారలా ఆశీర్వదించి పంపాడంటే ఆయన మాట అమోఘం గదా. తప్పక ఫలించి తీరవలసిందే అది. ఇరువురి జీవితంలోనూ చెప్పినవన్నీ ఫలించాలి. ఒకరికి ధనకనక వాహనాదులూ మరొకరికి కేవలం

Page 369

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు