#


Index



నిర్గుణ భక్తులు - కుచేలుడు



ఏమి తపంబు సేసె నొకొ యీ ధరణీ దివిజోత్తముండు తొ ల్బామున యోగి విస్ఫుర దుపాస్యకుడై తనరారు నీజగ త్స్వామి రమాధి నాథు నిజ తల్పమునన్ వసి యించి యున్నవా డీ మహనీయ మూర్తికెనయే ముని పుంగవులెంత వారలున్

తన మృదు తల్పమందు వనితా మణియైన రమాలలామ పొం దునునెడగా దలంపక యదు ప్రవరుండెదురేగి మోదముం దనుకగ గౌగిలించి యుచిత క్రియలం బరితుష్టు జేయుచున్ వినయమునన్ భజించె ధరణీ సురుడెంతటి భాగ్యవంతుడో


  బాగానే గ్రహించారా పడతులు. ముని పుంగవులెంత వారలైనా ఆయన కెనగారట. కారణం. తమ భర్త తల్పంమీద అంతవరకూ ఏ మునీశ్వరుడూ కూచోగా చూడలేదు వారు. కుచేలుడొక్కడే కూచోగలిగాడు. అలాగే ఎంతో భాగ్యవంతుడట. కారణం సాక్షాలక్ష్మియైన రుక్మిణే స్వయంగా వింజామర పుచ్చుకొని వీస్తున్నది. దీనిలో అంతరార్ధమేమంటే అంతకు ముందాయన దరిద్రుడైనా లక్ష్మీకటాక్షం వల్ల ఇక మీదట తప్పకుండా భాగ్యవంతుడు కావటానికి సందేహం లేదు.

  సరే వీరలా తమలో తాము గుసగుస లాడుతుంటే ఇక ఆ సహాధ్యాయులేమి చేస్తున్నారు.

మురసంహరుడు కుచేలుని కరము కరంబున దెమల్చి కడకన్ మనమా గురు గృహమున వర్తించిన చరితములని కొన్ని నుడివి చతురత మఱియున్

  కృష్ణుడు కుచేలుడి చేయి పట్టుకొని చిన్నప్పుడు తామిద్దరూ గురుకులంలో చదువుకొన్నప్పటి సంగతులు కొన్ని ప్రస్తావన చేస్తాడు. ఇది సహజమే ఈ వ్యవహారం. చిరకాలానికి కలుసుకొన్న మిత్రులు తమ బాల్యవిషయాల గూర్చి మాటాడుకోవటంలో ఆశ్చర్యం లేదు. కాని అందులో కూడా ఎంతో చతురత ఉందంటున్నాడు కవి. ఏమిటా చతురత. ఆ బాల్యంలో జరిగిన విషయాలెన్నో ఉన్నాయి. అందులో కొన్ని మాత్రమే ప్రస్తావించాడిప్పుడు. ఒక విషయం తరువాత ప్రస్తావన చేయబోతున్నాడు

Page 367

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు