అయితే ఒక విశేషముంది ఇందులో మరలా. సామాన్యుడికైతే సంశయ పిశాచం పట్టుకోటం వరకే. పట్టిందంటే సామాన్యంగా వదలదది. పోతే ప్రాజ్ఞులూ, మహా భాగవతులూ, అయిన పెద్దల విషయమలా కాదు. మానవ సహజంగా ఒకవేళ అలాంటి భూతమావేశించినా, అది తాత్కాలికమే. ఎప్పటికీ పట్టి పీడించేది కాదు. మంచులాగా కప్పినట్టే కప్పి మరలా క్షణంలో ఎక్కడిక్కడ విరిసిపోగలదు. దానికి కారణం వారి కపురూపంగా ఉదయించిన జ్ఞానమే. సమస్తమూ పరమాత్మేననే సమ్యగ్ జ్ఞానమది. అలాటి జ్ఞానం ప్రారబ్దవశాత్తూ తాత్కాలికంగా సంశయభూతాన్ని రెచ్చగొట్టినా మరలా జోకొట్టి దాన్ని నిద్ర పుచ్చగలదు. తనదారి కడ్డు లేకుండా చేసుకొని ముందుకు సాగిపోగలదు. ఇలాంటి నిశ్చయ జ్ఞానమున్నవాడు గనుక కుచేలుడు మరలా ఇలా భావన చేయసాగాడు.
"ఐన నాభాగ్యమతని దయార్ధ దృష్టి గాక తలపోయగా నొండుగలదె యాతడేల నన్ను నుపేక్షించు నేటి మాటలనుచు నా ద్వారకాపుర మతడు సొచ్చి”
ఎంత పిచ్చి నాకు. ఎందుకు నాకీ సందేహం. నా అదృష్టమెలా ఉంటే అలా జరుగుతుంది. నా ప్రాప్తమూ, ఆయన అనుగ్రహమూ ఇవి రెండూ గాక మరొక ఆలోచన కాస్కారమేముంది. అనన్య దృష్టితో జీవితయాత్ర సాగించే నన్ను ఆయన ఎందుకుపేక్షిస్తాడసలు. పట్టణమెలా ప్రవేశించాలో ప్రాసాదమెలా ప్రవేశించాలో ద్వారపాలకుల కేమి చెప్పాలో అంతా ఆయనే చూచుకొంటాడు. నాకు దేనికీ చింత అనుకొంటాడు. ఏమిటర్ధం. జీవుడు చింత పెట్టుకొన్నంత వరకూ దేవుడు కాపాడబోడు. వాడే చూచుకొంటాడు పొమ్మని ఉపేక్షించి ఊరుకొంటాడు. అలా కాక అయ్యా అంతా నీదే నాదేమీ లేదని అనన్య భావనతో ఉన్నపుడే ఆయన అనుగ్రహిస్తాడు సాధకుణ్ణి.
అనన్యా శ్చింతయంతో మాయేయే జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్
అని గదా భగవద్వాణి. జీవుడి యోగక్షేమాల కాయనే జవాబుదారు. ఇలా జవాబుదారీ ఆయనకే ఎప్పుడొప్పజెప్పాడో కుచేలుడిక ఆ భాగవతుడి దారి కడ్డమాక లేకుండా పోయింది. ద్వారకాపుర మెలా ప్రవేశించాలి. రాజభవనమెలా
Page 364