అనుమానం పెనుభూతమన్నట్టు అన్నిటికన్నా పాపిష్టిదైనది సంశయం. పాపిష్ఠస్సంశయః అని భగవత్పాదులే ఒక చోట సెలవిచ్చారు. అజ్ఞానమూ, అశ్రద్ధా, సంశయమూ ఈ మూడూ సాధన మార్గంలో జీవుణ్ణి ప్రతిఘటంచే దుష్టశక్తులు. మూడూ దుష్టమే అయినా మూడింటిలో “సంశయాత్మా వినశ్యతి” అన్నది గీత. సంశయమనేది మిగతా రెంటికన్నా పాపిష్ఠిది. అది కలగకుండానే ఉండాలి గాని కలిగితే పాడయిపోతాడు మానవుడు. ఎందుకంటే “నాయమ్ లోకోస్తి నపరో – న సుఖమ్ సంశయాత్మనః” ఇటు ఇహమూ లేదు. అటు పరమూ లేదు. సంశయాత్ముడికి రెంటికీ తప్పిన వాడికసలు సుఖమే లేదు. కాబట్టి ఐహికమేమిటి. ఆముష్మికమేమిటి. ఎక్కడా కూడా సంశయమనేది పనికిరాదు. అది రెంటికీ చెడ్డ రేవడి సామెతవుతుంది. ఆసించిన ఫలితం లేకపోగా అనుకోని దుష్ఫలితం వచ్చి నెత్తిన పడుతుంది.
అయితే చిత్రమేమంటే పిలిస్తే పలుకుతుందీ సంశయమనేది ప్రతివాడికీ. మోక్ష సాధన మార్గంలో పయనించే ప్రతివాడికీ ఎక్కడో ఒక భూమికలో ఇది ఎదురవుతుంది. తప్పదు. అంత దివ్యజ్ఞాన సంపత్తితో మొరపెట్టే గజేంద్రుడు కూడా మధ్యలో ఏమన్నాడు. "కలడు కలండనెడు వాడు కలడో లేడో” అని వాపోయాడు ఏమి కారణం. ఎంత మొఱపెట్టినా పలకలేదే అసలున్నాడా లేడా ? అని అనుమాన మేర్పడింది. అలా ఏర్పడటం కూడా సహజమే. ఎందుకంటే మోక్షమనేది మానవుడింత వరకూ చూచింది గాదు. చేసింది గాదు. అది ఎలా ఉంటుందో ఆఅనుభవం తెలీదు. అయితే ఉంది సందేహం లేదని గట్టిగా బల్లగుద్ది చెబుతున్నాయి శాస్త్రాలూ, గురువులూ. ఆ వాక్యాలు శ్రవణం చేయటమే తప్ప మనకంతకన్నా దాని అనుభవం లేదు. అది అందుకొనే మార్గం కూడా వారు చెప్పే మాటల మీది నమ్మకంతోనే పట్టుకొని ముందుకు పోతున్నాము. పోతున్నామే గాని అది మనలను గమ్యం చేర్చేటంత వరకూ పూర్తి నమ్మకం లేదు మనకు. కాబట్టి పెద్దలెంత అభయమిచ్చినా మనకు భయమే. “అభయే సతి బిభ్యతి" అని గౌడపాదులే గోల పెట్టారు. ఇందుకేనేమో బ్రహ్మదేవుడంతవాడు భగవన్నాభి కమలం నుంచి బయటపడ్డాడో లేదో నలువైపులా చూచి తాను తప్ప మరేదీ కనిపించకపోయే సరికేది సత్యమో అది ఎలా అర్థం చేసుకోవాలో తెలియక భయపడి పోయాడట. కనుక పరిచితమైన ప్రాపంచిక విషయాలలోనే తప్పనప్పుడిక అదృష్టపూర్వమైన మోక్షమార్గంలో సంశయ మెదురయిందంటే తప్పేముంది. అలాగే ఎదురయిందిప్పుడు కుచేలుడికి కూడా.
Page 363