ఇవ్వమనలేదే. మన దరిద్రస్థితి ఎల ఉందో ఇప్పటికైనా చూచి తెలుసుకోమని పతిని ఎత్తి పొడవటమా ఇది. ఛీ. పతివ్రత అయిన ఆ ఎలానగ ఇంత అవహేళన చేస్తుందా భర్తను. మరి దేనికది. లౌకికమైన ఆచారాన్ని నిలబెట్టటానికా. అదీ కాదు. ఉంటే ఆచారంగాని లేకుంటే ఏమాచారం. మరిదేనికి తెచ్చినట్టు. భౌతికంగా మాటాడితే ఇంతకాలమింత పేదరిక మనుభవిస్తున్నా ఆ ఇల్లు ఎలా గడుస్తున్నదో మన మర్ధం చేసుకోటానికి. ఇరుగుపొరుగూ ఆ దంపతుల మీద ఎంతో గౌరవంతో అదరంతో అప్పుడప్పుడు తోచిన సహాయం చేస్తుంటే ఆ మాత్రమైనా నిలబడిందా సంసారం అని తెలుసుకోవాలి మనం. ఇది ఒక సమాధానం. పోతే ఆధ్యాత్మికంగా మరొక సమాధానమేమంటే నీవు జ్ఞానివై నిష్కామంగా బ్రతకటానికి సంసిద్ధుడవయి ఉండాలే గాని నిన్నా సర్వేశ్వరుడెప్పుడూ తప్పజూడడు. "ఈశ్వర స్సర్వభూతానాం హృద్దేశే ర్జున తిష్ఠతి” అన్నట్టు అంతర్యామి రూపంగా సర్వుల హృదయాలలో ఉన్నాడు కాబట్టి ఆయనే ఎవరికో ఒకరికి సద్బుద్ధి పుట్టించి నీకు సహాయపడేలాగా చూస్తాడు. ఇదీ అంతరార్థమిక్కడ.
సరే బయలుదేరాడు కుచేలుడు భగవత్సందర్శనార్థం. బయలుదేరి దారిలో నడచిపోతుంటే ఆ బ్రాహ్మణుడికున్నట్టుండి ఒక సందేహం పట్టుకొన్నది.
ద్వారాకా నగరంబు నేరీతి జొత్తును - భాసురాంతఃపురవాసియైన యప్పుండరీ కాక్షు నఖిలేశు నెబ్బంగి - దర్శింపగలను - తద్ద్వారపాలు రెక్కడి విప్రుడ - విందేల వచ్చెద - వని యడ్డపెట్టిరే నపుడు వారి కేమైన బరిదానమిచ్చి చొచ్చెద నన్న - నూహింప నర్థశూన్యుండ నేను
ద్వారకా నగరమంటే అది ఒక పల్లెగాదు. పట్నంగాదు. బ్రహ్మాండమైన రాజధాని. అలాంటిదెప్పుడూ కని విని ఎరిగినవాడు కాదా బ్రాహ్మణుడు. అందులో ప్రవేశించటమే అసలు కష్టసాధ్యం. అదే కష్టమైతే ఆ పట్టణంలో ఆ పరమాత్మ ఉండే ప్రాసాదమెక్కడో అందులో అంతఃపుర మెక్కడో అతడి కేమాత్రమూ అంతుపట్టే వ్యవహారంకాదు. పోతే అసలు ద్వారం దగ్గరే అక్కడే ఉన్న ప్రతీహారు లడ్డగించి పొమ్మని బెదిరిస్తే తాను చేసేదేమీ లేదు. పోనీ వారికేమైనా కొంచెం ముట్టజెప్పి జొరబడుదామంటే గోచి పాతరాయడు తన దగ్గర ఏముందని ఇదీ అతనికి పట్టుకొన్న సంశయం.
Page 362