#


Index



నిర్గుణ భక్తులు - కుచేలుడు

ఒక పదార్థమని గాదు. పదార్థాలన్నీ భౌతికాలు. భౌతికమైన ఈ పదార్ధాలా పరమాత్మ కిచ్చినా ఒకటే. లేకున్నా ఒకటే. కాకపోయినా ఆయనకు మనమిచ్చేదేమిటి. ఇదంతా ఎవరబ్బ సొమ్మని. “ఈశావాస్య మిదమ్ సర్వ” మని అంతా ఆ పరమాత్మ తాలూకు ఆస్తే గదా. ఇందులో మనకేమి హక్కుంది. పూచిక పుల్ల కూడా లేదు. మరిఏముంది ఇవ్వటానికని అడగటం దేనికి. ఇచ్చే పదార్థం కాదు ప్రధానం. ఇచ్చే బుద్ధి. “తేనత్యక్తేన భుం జీథాః" అని త్యాగబుద్దే ఇక్కడ కావలసింది మానవుడికి. ఆ బుద్ధి ఉంటే పదార్ధమేదైనా ఎంతైనా చాలు. "పత్రమ్ పుష్పం ఫలమ్ తోయమ్ - యోమే భక్త్యాప్రయచ్ఛతి" అని పరమాత్మే హెచ్చరిస్తున్నాడు మనలను. భక్తే ప్రధానంగాని ఇది పత్రమా పుష్పమా అని కాదు.

  కుచేలు డడగటంలో ఇంకొక రహస్యం కూడా ఇమిడి ఉంది. "సర్వ ధర్మాన్ పరిత్యజ్య” అన్నట్టు భాగవతుడు తన సర్వస్వమూ భగవంతుడికి సమర్పించటం మొదటి కర్తవ్యం. అలా నిరవశేషంగా సమర్పణ చేసినప్పుడే అది పరిపూర్ణ వైరాగ్యమూ, సన్న్యాసమూ. అలాటి ముక్తసంగుడికే ఆయన ముక్తిని ప్రసాదించేది. అలా కాక ఏ కొంచెం తనది అని దగ్గరుంచుకొన్నా ఆ మహాఫలానికి నోచుకోలేడు. దానిమీదికే పోతుంటుంది మనసు. మనసు విషయ ప్రపంచం నుంచి తొలగి నిర్మలం కావాలంటే దాని వాసన కూడా పని చేయగూడదు. తను ధనమనః ప్రాణాదులలో అణుమాత్రం మిగిలి ఉన్నా తనది అనే అభిమానమున్నా ఆ మేరకు వాడు రక్తుడే. లిప్తుడే. బద్ధుడే. ముక్తుడు కానేరడు. అది వదలినప్పుడే దాని కర్హుడు. ఇలాటి అర్హత జీవులకుండాలని నిరూపించటానికే ఈ సన్నివేశం. అంతేగాని ఈయన దగ్గర ఏదో ధన కనక వస్తు వాహనాది సామగ్రి ఉందని గాదు. ఆయనకిస్తాడని కాదు. దీని కోసమాయన కనిపెట్టుకొని కూచున్నాడనీ కాదు.

  సరే. భర్త అడిగాడో లేదో ఆ భార్య తన భర్తకన్నా నాలుగాకు లెక్కువ చదివింది. ఈయన మన ఇంట్లో ఏదైనా ఉందేమో చూడమని అడిగితే ఆవిడ పొరుగింటికి వెళ్లి అప్పుతెచ్చింది. ఏమిటి. నాలుగు పిడికిళ్లు అటుకులు. "యాచిత్వా చతురో ముద్దీన్ - విప్రాన్ పృథుక తండులాన్ భర్తే ప్రాదాదుపాయనమ్” అక్కడా ఇక్కడా నాలుగు పిడికిళ్లటుకులు యాచించి తెచ్చి భర్త గారి కందిచ్చింది. ఏమిటీ న్యాయం. అప్పయినా తెచ్చి ఇవ్వకపోతే నేమీ ఇంట్లో ఉంటే చూడమన్నాడు గాని అప్పు తెచ్చి

Page 361

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు