#


Index



నిర్గుణ భక్తులు - కుచేలుడు

  మరి ఇప్పుడెందుకు వెళ్లటం. భార్య చెప్పిందనా. కాదు. దారిద్య్రం పోగొట్టు కోవాలనా. అంతకన్నా కాదు. ఉత్తమ శ్లోక దర్శనమయినా అవుతుందని. అక్కరలేదన్నారుగా బ్రహ్మవేత్తకు. నిజమే. అక్కరలేదు వాస్తవానికి. అయితే అది స్వరూపానుభవం. ఆ స్వరూపమే విభూతిగా వెలసింది ద్వారకలో. నీలమేఘ శ్యామలమైన నిత్యలీలా ప్రదర్శకమైన ఆ మూర్తి కేవలమా చైతన్య విభూతే మరేదీ గాదు. అది పరమైతే ఇది అపరం. అది అవ్యక్తమైతే ఇది వ్యక్తం. అది అచలమైతే ఇది నిత్య ప్రచలితం. అది సర్వవ్యాపకమైతే ఇది ఏకదేశ వివర్తి. "తస్మిన్ దృష్టే పరావరే” అన్నట్టు యోగి అయినవాడదీ ఇదీ రెండూ దర్శించాలి. దర్శిస్తూ ఇవి రెండూ తన స్వరూపమే గదా అని అనుసంధించుకోవాలి. ఇది బ్రహ్మవేత్తల జీవితంలో అతి నిగూఢంగా జరిగే ఒక ప్రౌఢమైన వ్యవహారం. అలా సాగినప్పుడే వారి బ్రహ్మానుభవానికి పరిపూర్ణత.

యదాభూత పృథగ్భావమేకస్దమను పశ్యతి తత ఏవచ విస్తారమ్ బ్రహ్మ సంపద్యతే తదా

  అని గదా శాస్త్రవచనం. దానికి తార్కాణిమిప్పుడీ కుచేలుడి ప్రవృత్తి. తద్వారా మోక్షసాధకుల కలాటి ఒక సందేశమివ్వాలని కూడా ముని హృదయం. అందుకే ఈ ఉత్తమ శ్లోక దర్శనం. అందుకే ఈ ప్రయాణం.

  మరి ఊరక రిక్త హస్తాలతో పయనమై పోతే ఎలాగ. పెద్దలను చూడటానికి వెళ్లేటప్పుడేదైనా వారికొక ఉపాయనం తీసుకెళ్లాలని లోకంలో ఒక ఆచారముంది. అలాటి లోకాచారాన్ని పాటిస్తూ కుచేలుడు కూడా అడుగుతున్నాడు తన భార్యను. "అప్యస్త్యుపాయనమ్ కించి దృహే కల్యాణీ దీయతామ్” మన ఇంట్లో ఆయనకు సమర్పించవలసిన వస్తువేదైనా ఉంటే చూడు. ఆయన నడగటానికి వెళ్లేవాడు తానే ఆయనకేదో సమర్పిస్తానంటాడు చూడండి. ఇది ఎంత బాగుందో ఈ మాట. కేవలం లోకధర్మం కోసమని చెప్పినా పూట గడవటం కష్టంగా ఉన్నవాడు తానేమీయగలడని. అసలయ్య వారి నట్టిల్లులాగా ఉన్న తన ఇంట్లో ఏముందని. అయినా బరవసాగా ఆ మాట అన్నాడంటే ఆ బ్రాహ్మణుడు ఏ దృష్టితో అన్నాడో ఆలోచించాలి మనం. తన దగ్గర ఉందని గాదు. చేసిందని గాదు. ఉందో లేదో తెలియదా అతనికి. బాగా తెలుసు తనకేదీ లేదని. అయినా ఇస్తానంటున్నాడు. ఆ ఇస్తానంటున్న దప్పటికేదో

Page 360

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు