ఏవమ్ సభార్యయా విప్రా - బహుశః ప్రార్థితో మృదు అయమ్ హి పరమో లాభ - ఉత్తమ శ్లోక దర్శనమ్
అయితే మహావిరక్తుడు కాబట్టి ఆ బ్రాహ్మణుడు దాని కనుగుణంగా ఒక మాట అంటాడు. ద్రవ్యమడగటానికి కాకపోయినా అలాటి మహానుభావుణ్ణి దర్శనం చేసుకోవటమే గొప్ప లాభమట. చూచారా ఈ చమత్కారం. ద్రవ్యం కోసమని భార్య ప్రోత్సహించిందాయనను పోయి రమ్మని. న్యాయమైతే అప్పుడాయన ఉన్న దశలో ద్రవ్యలాభమే లాభంగా భావించాలి. కాని ఆయన దానినొక లాభంగా భావించటం లేదు. పై పెచ్చు భగవద్దర్శనమే లాభంగా పరిగణిస్తున్నాడు. చూడబోతే "యంలబ్ధ్వాచాపరం లాభం - మన్యతే నాధికం తతః" అని గీతాకారుడు వర్ణించిన స్థిత ప్రజ్ఞ లక్షణమిక్కడ మనకు దాఖలా అవుతున్నది. స్థితప్రజ్ఞుడైన మహానుభావుడిక ఏదీ లాభంగా చూడడు. ఆత్మ లాభమొక్కటే అతడు చూచే లాభం. అంతకు మించిన లాభం మరేదీ లేదు. ప్రస్తుతం కుచేలుడి స్థితి అదే. పరమాత్మ దర్శనమే లాభమతని పాలిటికి. మరేదీ గాదు. అంటే ఆయన వల్ల పొందే ధనధన్యాదులేవీ కావని భావం.
అయితే ఇక్కడ మరొక విశేషం కూడా ఉంది మనం తెలుసుకోవలసింది. ఆ మాటకు వస్తే కృష్ణ దర్శనార్థం వెళ్లవలసిన అవసరం కూడా లేదాయనకు. బ్రహ్మవేత్తలలో కెల్లా ఉత్తముడు గదా అతడు. బ్రహ్మవేత్తకి ప్రపంచమంతా బ్రహ్మమయమే. ఆత్మమయమే. ఆత్మరూపంగా నిత్యమూ దర్శిస్తూనే ఉన్నప్పుడిక ప్రత్యేకంగా ఎప్పుడో ఒక ముహుర్తం చూచుకొని ఏ ద్వారకకోపోయి ఆయనగారిని దర్శించాలనే ప్రయత్నం దేనికి. ప్రహ్లాదుడెక్కడికి వెళ్లి దర్శించాడని. అడుగుతున్నా తాను జ్ఞాని కాబట్టి "కలండు తండ్రి వెదకంగా నేల యీ యా యెడన్” అని దబాయించినవాడా బాలుడు. అలాగే కుచేలుడు కూడా సర్వత్రా భగవద్దర్శనం చేస్తూనే ఉన్నాడు. అలా చేస్తున్నాడు గనుకనే దారిద్య్ర నివారణార్ధమని కాకపోయినా బాల్యమిత్రుడనే దాక్షిణ్యంతో నైనా చూడకుండానే ఎన్నో ఏండ్లు పూండ్లు గడుపుతూ వచ్చాడు. ఏమి కారణం. కృష్ణుడంటే అభిమానం లేదా. లేక కాదు. కావలసినంత ఉంది. కానీ అది భగవద్విభూతే గాని స్వరూపం కాదని తెలుసునా బ్రహ్మవేత్తకు. స్వరూపమెక్కడ బడితే అక్కడే ఉంటుంది. నిరాకారంగా నిశ్చలంగా ఉందది. దానినెప్పుడూ తన కభిన్నంగా దర్శిస్తూనే ఉన్నాడాయెను. ఇక క్రొత్తగా పోయి చూడవలసిన పని ఏముంది. అందుకే పోలేదెప్పుడూ.
Page 359