#


Index



నిర్గుణ భక్తులు - కుచేలుడు

తూలనాడతారు. చివరకు మెడపట్టి ఇంటి నుంచి గెంటినా గెంటుతారు. కుచేలుడి భార్య అలాంటిది కాదు. "తస్యభార్యా కుచేలస్య పతివ్రతా” అంటాడు కవి. పతివ్రత ఆవిడ. ఇది సార్ధకమైన మాట. ఆయన ఏ వ్రతం పడితే అదే ఆవిడ వ్రతం కూడా. ఆయన యదృచ్ఛా లాభసంతుష్టుడు. జితేంద్రియుడు, విరక్తుడు. ఈవిడా అంతే. ఇది లేదది లేదని ఒక్కనాడై నా నిష్ఠుర మాడింది కాదు. అలాగైతే ఎప్పుడో వారిద్దరూ చెరి ఒక దారిపట్టి ఉండేవారు. అలాటిది కాదు గనుకనే ఇంత పేదరికమైనా భరిస్తూ పల్లెత్తు మాట అనక ఆయనను కనిపెట్టుకొని కాలక్షేపం చేస్తున్నది.

  అయితే ఇప్పుడు మాత్రమేమి అలాగే ఉండరాదా అంటే ఉండవచ్చు. "క్షుత్క్షామాచ తథా విధా పతివ్రతా” క్షుత్ క్షామ అయినా పతిననుసరిస్తూనే వచ్చింది. కాని తన కోసమని కాకపోయినా కడుపున బుట్టిన బిడ్డలు కష్టపడుతుంటే చూడలేక పోయింది. అంతేగాక కట్టుకొన్న మగడంత మహనీయుడలాంటి దీనస్థితిలో ఉండటం కూడా భరించలేకపోయింది. కనుకనే “దారిద్ర్యాద్వేప మానాసా మ్లాయతా వదనేనసా” అంటాడు. ఇంటిల్లిపాదికి తారసిల్లిన దారిద్ర్యానికి ముఖం వెలవెలబోతూ అప్పటికీ ఎంతో మృదుమధురంగా అలా మాటాడింది. సుకుమారంగానే పెనిమిటిని హెచ్చరించింది. ఆ హెచ్చరించటం కూడా ఒక విధంగా ఈశ్వర సంకల్పమే కావచ్చు. లేకుంటే ఇన్నాళ్లూ పుట్టని బుద్ధి ఆవిడ కానాడే పుట్టి ఆయనకు బోధ చేయటమేమిటి. చేస్తే ఆయన బయలుదేరి పోవటమేమిటి. అప్పటికి తీరిపోయిందా జీవుని ప్రారబ్ధం. అనన్యాదృశమైన ఐశ్వర్యం ప్రాప్తించే క్షణం సమీపించింది. దాని కనుగుణంగా ఆవిడకా బుద్ధి పుట్టింది. పైగా ఆవిడకెలా తెలిసిందో ఏమో “ఆస్తే 2 ధునా ద్వారవత్యామ్. భోజ వృష్ణ్యంధకేశ్వరః" ఆ మీ బాలసఖుడిప్పుడు ద్వారకలోనే ఉన్నాడు. వెంటనే వెళ్లి దర్శిస్తే సమస్తమూ మీకప్పగిస్తాడని తొందర చేస్తుంది. భర్తకు కూడా తెలియని వృత్తాంత మామెకు తెలిసి చెప్పిందంటే అది నిజంగా భగవంతుడు పుట్టించిన బుద్ధే మరేదీ కాదు. ఆయనే ఆ బుద్ధి ఆమెకు పుట్టించి ఆమె భర్తను తన దగ్గరకు స్వయంగా రప్పించుకోటానికి పన్నిన పన్నాగం.

  దానికి తగినట్టే చూడండి. ఏది ప్రాప్తమైతే అదే చాలునని నిర్లిప్తంగా బ్రతికే ఆ మహనీయుడు ఆవిడ అన్నదో లేదో - సరే అలాగే వెళ్లి వస్తానని ఆమె మాట ఆమోదిస్తాడు.

Page 358

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు