#


Index



నిర్గుణ భక్తులు - కుచేలుడు

  కృష్ణ పరమాత్మ అవతరించిన కాలంలో ఆయనకు సాక్షాత్తూ ప్రాణస్నేహితుడైన ఒక బ్రాహ్మణుడు కుచేలుడనేవాడు ఉండేవాడు. ఆయన బ్రహ్మవేత్తే గాదు. బ్రహ్మవేత్తలలో వరిష్ఠుడట. అంత వరిష్ఠుడు కావటం మూలాన్నే ఇంద్రియార్థాలు వేటిలోనూ లగ్నం గాక విరక్తుడయి ప్రశాంతంగా బ్రతుకుతుండేవాడు. అయితే మరి ఆయనకు జీవనమెలాగ అని ప్రశ్న వస్తే చెబుతున్నాడు. "యద్న్బయో పప న్నేన వర్తమానో గృహాశ్రమీ” “యదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః” అని స్వామి వారు చెప్పినట్టు ఎప్పుడేది లభిస్తే దానితో దేహధారణ చేస్తూ కాలం గడిపేవాడట. చూడండి. కృష్ణుడి కాలంలో ఉన్నాడు కుచేలుడు. ఆయనతోపాటు చదువుకొన్నవాడు. బాల్యంనుంచీ ఆయనకు ప్రాణస్నేహితుడు. అలాంటప్పుడు పెరటిలో కామధేనువును కట్టి వేసుకొన్నట్టే గదా. ఎంతైనా భోగభాగ్యాలతో నిత్యమూ తులతూగుతుండాలా బ్రాహ్మణుడు. కానీ నిష్ఠదరిద్రుడు. ఏమిటీ చిత్రం. ఇందులో చిత్రమేమీ లేదు. బ్రహ్మవి ద్వరిష్ఠుడూ విరక్తచిత్తుడూ గనుకనే దారిద్రాన్నే మహైశ్వర్యంగా భావిస్తున్నాడు. పండితా స్సమదర్శినః అన్నట్టు సమదర్శి అతడు. అతని సమదర్శి స్వభావాన్ని చాటటానికే ఈ విరోధా భాస.

  మరి అతడైతే బ్రహ్మవేత్త గనుక అలా ఉండగలిగాడు గాని అతణ్ణి కట్టుకొన్న భార్యాపుత్రులకెలా ఉంటుందా నిబ్బరం. వారు దుర్భరమైన దారిద్య్ర బాధ నోర్చుకోలేక పోయారు. ఓర్చుకోలేకనే ఒకనాడాయన భార్య భర్తను చూచి ఇలా మొరపెడుతుంది. “నను బ్రహ్మన్ భగవత స్సఖా సాక్షాద్ర్ఛియః పతిః" స్వామీ మీరు మహానుభావులు సాక్షాత్తూ లక్ష్మీపతి అయిన కృష్ణ భగవానుడు మీకు బాల్య స్నేహితుడు. "బ్రహ్మణ్యశ్చ శరణ్యశ్చ భగవాన్ సాత్వతాం పతిః" అతడు బ్రాహ్మణ ప్రియుడు. శరణాగత రక్షకుడు. కాబట్టి "తముపైహి మహాభాగ - సాధూనాంచ పరాయణమ్” ఆయన గారిని మీరు పోయి అడిగి చూడండి. “దదాతి ద్రవిణమ్ భూరి సీదతే తే కుటుంబినే.” అడిగితే ఇవ్వకపోడు. అయ్యో ఈ కుటుంబీకుడు చాలా క్రుంగిపోతున్నాడే అని అడిగిన దానికన్నా ఎక్కువే మీకు ప్రసాదిస్తాడు. చూడండి ఆ బ్రాహ్మణుడి భార్య ఎంత మహనీయురాలో. ఆయనే గాదు. ఆవిడ కూడా ఆయన స్వభావానికి తగినదే. కొందరు గయ్యాళి గంపలుంటారు. కర్కోటకులుంటారు. మొండి సన్న్యాసులుంటారు. మరీ పెనిమిటి దరిద్ర స్థితిలో ఉన్నాడంటే ఎంతైనా చులకన చేసి మాటాడుతారు

Page 357

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు