#


Index



నిర్గుణ భక్తులు - కుచేలుడు

వైరాగ్యాన్నే సన్న్యాసమని కూడ వ్యవహరిస్తుంది శాస్త్రం. “జ్ఞానమ్ సన్న్యాస లక్షణమ్” జ్ఞానానికి సన్న్యాసమే లక్షణమట. ఇవి రెండూ సమగ్రంగా ఉన్నప్పుడే సమగ్రమైన ఫలాన్ని మనకవి ప్రసాదిస్తాయి. ఇందులో జ్ఞానమనేదాని కుదాహరణ ప్రాయం ప్రహ్లాదుడి చరిత్ర అయితే - వైరాగ్యాని కుదాహరణం ప్రస్తుత మీ కుచేలుడి కథ. రెండూ పరస్పరం అవినాభూతమైన లక్షణాలైనా ఒక్కొక్క దాని స్వరూపాన్నీ మనం విడివిడిగా చూచి పట్టుకోటానికీ రెండు కథలూ మనకు రెండు విధాలుగా ఉపకరిస్తాయి. రెండు భావాలకూ రెండు కథలూ కేవలం ప్రతీకలే. అది వారి నామధేయాలే మనకు వెల్లడి చేస్తున్న రహాస్యం. ప్రహ్లాద అంటే అఖండమైన నిర్వృతి. అది జ్ఞానానికి చిహ్నం. అలాగే కుచేల అంటే దుర్వాసన్ అన్నట్టు జీర్ణ వస్త్రధారి అని శబ్దార్థం. శబ్దార్థమిదే అయినా భాగవత ముద్దేశించిన లక్ష్యార్థం వేరు. జీర్ణ వస్త్ర మెవడు ధరిస్తాడు. కేవల దరిద్రుడు. దరిద్రత అంటే ఏమిటిక్కడ. ఏదీ లేకపోవటం. అంటే ప్రాపంచికమైన భోగ భాగ్యాలకు దూరం కావటం. ఇది కేవల వైరాగ్యానికి సూచకం.

  అంచేత కుచేలోపాఖ్యానం కేవల వైరాగ్యభావానికి ప్రతీకగా సాగిన కథ. కుచేలుడికి మరొక నామధేయం కూడా ఉన్నది. అది శ్రీదాముడు. దామమంటే పూలమాల. శ్రీ అంటే లక్ష్మి. లక్ష్మిని మెడలో ఒక దండలాగా ధరించి తిరిగేవాడు. అంటే చాలా ధనవంతుడని గదా అర్థం. మరి అలాటివాడు కుచేలుడెలా అయ్యాడు. అదీ చిత్రం. భౌతికంగా ఏ ధనధాన్యాలూ, భోగభాగ్యాలూ లేకున్నా అధ్యాత్మికంగా ఐశ్వర్యంగా భావించేవాడంటే అది ఎంత మహాజ్ఞాని కుండవలసిన లక్షణం. “వాసుదేవ స్సర్వమితి” అని ద్వంద్వాత్మకమైన సృష్టినంతా పరమాత్మ రూపంగా దర్శించి దాన్ని నిత్య జీవితంలో అనుభవానికి తెచ్చుకొన్న బ్రహ్మవేత్తకే అది సాధ్యం. కుచేలుడలాంటి బ్రహ్మవేత్త. ఆయన పాత్రను మనకు ప్రవేశపెట్టటంలోనే భాగవతమిలాటి మహదాశయాన్ని ప్రకటిస్తున్నది.

కృష్ణస్యాసీ త్సఖా కశ్చి - ద్ర్బాహ్మణో బ్రహ్మవిత్తమః విరక్త ఇంద్రియార్దేషు - ప్రశాంతాత్మా - జితేంద్రియః

Page 356

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు