#


Index



నిర్గుణ భక్తులు - కుచేలుడు

13. నిర్గుణ భక్తులు - కుచేలుడు

  ప్రహ్లాదోపాఖ్యానమయింది. ఇక కుచేలోపాఖ్యానానికి వచ్చాము. ప్రహ్లాదుడూ, కుచేలుడూ ఇరువురూ జ్ఞానయోగులే. నిర్గుణోపాసకులే. కేవల జ్ఞాననిష్ఠాపరులై ఇరువురూ మోక్షఫలాన్ని చవిచూచిన వారే. ఐతే ఎంతవరకంటే ప్రహ్లాదుడు రాక్షస వంశంలో పుట్టిన కారణ జన్ముడైతే కుచేలుడు అచ్చమైన బ్రాహ్మణ వంశంలో జన్మించినవాడు. “శుచీనామ్ శ్రీమతాం గేహే" అన్నట్టు ఒకరు ఆ గర్భ శ్రీమంతుని ఇంట్లో జన్మిస్తే మరొకరు “అథవా యోగినా మేవ కులే భవతి" అన్న రీతిగా అకించనులైన మహాయోగుల కులంలో జన్మించారు. అతడు బ్రహ్మచర్యంలోనే జ్ఞాని అయితే ఇతడు గృహస్థుడయి ఉండి కూడా మహాజ్ఞాని. ఇదే చాలా కష్టమైన విషయం. అసిధారా వ్రతంలాంటిదిది. ఎందుకంటే బ్రహ్మచారిగా బ్రతికేవాడికి భార్యా బిడ్డలనే తగులముండదు. కాబట్టి వాడికే బాదర బందీ లేదు. కాలమంతా వాడి అధీనమే. ఎంత పరచింతనతో గడపినా గడపవచ్చు జీవితం. అలాగే గడపాడు ప్రహ్లాదుడు. పోతే కుచేలుడి విషయమలాకాదు. ఇతడు గృహస్థుడు. పెండ్లాముంది. బిడ్డలున్నారు. వారు ఒకరుగా రిద్దరు కారు. ఆవిడ కడుపు ఫలించినంత మంది. వీరందరినీ పెట్టి పోషించాలంటే అతడు ఏమీ సంపన్నుడు కాడు. పూట గడవని నిష్ఠదరిద్రుడు. ఇలాటి కఠోర దారిద్య్రమనుభవిస్తూ కూడా దానినే మాత్రమూ పట్టించుకోక మనసు నిరంతరమూ పరచింతనా భరాయత్తంగా బ్రతుకు సాగించాడంటే అది నిజంగా గొప్ప విషయం. ఎంతో గొప్ప వైరాగ్యభావముంటే గాని అది సంభవం కాదు.

  జ్ఞానముంటే లాభం లేదు. జ్ఞానానికి వైరాగ్యం కూడా తోడు కావాలి. జ్ఞానమనులోమంగా అభ్యాసానికి దారి తీస్తే వైరాగ్యం తదితరమైన విషయ ప్రపంచానికి మనలను దూరంగా తీసుకెళ్లుతుంది. దీనికి దూరమైతే గాని దానికి చేరువ కాలేడు మానవుడు. ఇది పూర్తి దూరమైతే అది పూర్తి దగ్గరవుతుంది. అప్పుడే జ్ఞానం జ్ఞాననిష్ఠగా మారి ముక్తి సుఖాన్ని ప్రసాదిస్తుంది మనకు. కనుకనే జ్ఞానానికి వైరాగ్యాన్ని అంగంగా పేర్కొంటుంది శాస్త్రం. "అభ్యాసే నతు కౌంతేయ వైరాగ్యాభ్యామ్ తన్ని రోధః" అని యోగశాస్త్రాలు కూడా ఘోషిస్తున్నాయి. ఈ

Page 355

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు