పోతే ప్రహ్లాదుడి కథ ఇక్కడితో ముగియలేదు. ఇది ప్రహ్లాదుడి బాల్యచరిత్ర. మరి వయసు వచ్చిన తరువాత రాజ్యపాలన చేసినప్పటి వృత్తాంతం కూడా ఎంతో ఉంది. అందులో ఒకటి రెండు ఘట్టాలు వస్తాయి మనకు భాగవతంలో. ఒకటి ప్రహ్లాదా జగర సంవాదం. అది ఇంతకు ముందే వర్ణించబడింది. దీనిని బట్టి బాల్యంలోనే సమసిపోక ఆ బ్రహ్మాకార వృత్తి వయసు మళ్లినా అనువర్తిస్తూనే ఉందని తెలుసుకోవచ్చు. మరి ఒకటి బలి మర్దన ఘట్టం. బలి చక్రవర్తి ప్రహ్లాదుని మనుమడే. అతణ్ణి త్రివిక్రముడు పాతాళానికి అణగద్రొక్కే సమయంలో ప్రహ్లాదుడక్కడికి వస్తాడు. అప్పటికి వరుణ పాశ వేష్టితుడు కావటం మూలాన బలి ఆయనకు ప్రణామం చేయలేక సిగ్గు పడతాడు. ప్రహ్లాదుడు నేరుగా వామన దేవుడున్న చోటికి పోయి సాష్టాంగదండ ప్రణామం చేసి ఇలా అంటాడు. స్వామీ! నీవితనికి మొదట ఇంద్రపదవి ప్రసాదించి పిదప దానిని దూరం చేశావు. చాలా మంచి పని చేశావు. ఆ పదవి వలన అహంకారానికి గురి అయినాడు మావాడు. నీవది తొలగించి శిక్షించటమే గాని వీణ్ణి బంధించటం కాదిది. తత్త్వజ్ఞుడైన వాడికి మహేంద్ర పదవి మరి ఒక పదవి దేనికి. నీ పాద కమల సేవ ఏమరకుంటే చాలదా. దాని మేర ఏదో చూపి వీడి ఏమరుపాటు పోగొట్టావు. చాలా సంతోషమని ప్రదక్షిణం చేసి వెళ్లిపోతాడు.
ఇలా చూస్తూ పోతే ఒక మహాజ్ఞాని అయిన వాడి ప్రవృత్తి ఎలాటిదో మనకర్థ మవుతుంది. బహు జన్మార్జిత పుణ్యఫలంగా ఒక్కసారి ఆ బ్రహ్మాత్మ జ్ఞానమనేది ఉదయించాలే గని ఉదయించిన తరువాత దానికిక అస్తమయం లేదు. అసలనుదితా నస్తమితమన్నారు దాన్ని అభిజ్ఞులు. అది కలిగిందో జీవితాంతమూ జ్ఞాని నతని నీడలాగా అనుసరించి ఉంటుంది. ఎప్పుడూ విడనాడదు. విడనాడేప్రశ్నే లేదు. విడనాడితే అది సమ్యగ్దర్శనమే గాదు. ఇలాటి అవిచ్ఛిన్న పరిపూర్ణానన్యభక్తి రూపమైన జ్ఞానయోగానికి నిదర్శనమే ఈ ప్రహ్లాదోపాఖ్యానం.
Page 354