#


Index



నిర్గుణ భక్తులు - ప్రహ్లాదుడు

పరమాత్మకు. స్వతహాగా రూపం లేకపోయినా ఏదో ఒక రూపంలో కనిపిస్తుందప్పు డప్పుడూ. “జననము లేక కర్మముల జాడలబోక" అనిగదా మొదటనే నిరూపించాము. జననమే లేకుంటే రూపమెక్కడిది. అయినా రూపం ధరించిందంటే అది దాని విబూతి యోగం. దేనికీ ప్రదర్శన. ప్రదర్శనే నిజానికిది. అదైనా దేనికంటే ధర్మ సంస్థాపనమే దాని ప్రయోజనం. అదే గదా భగవదవతార ప్రయోజనమని ఇంతకు ముందే వాక్రుచ్చి ఉన్నాము. అలాంటి ధర్మ సంస్థాపన కోసమే ఇప్పుడీ నరసింహావతారం. ఇది నరాకృతి గాదు. సింహాకృతి గాదు. ఏమిటీ విచిత్రం. హిరణ్యకశిపుణ్ణి సంహరించాలంటే ఇలాగే రావాలి మరి. ఎందుకని. వాడు గాలింగుంభిని అని దేనివల్లా చావు లేకుండా వరం తెచ్చుకొన్నాడు. కాబట్టి ఏదీగాని ఆకృతిలో వచ్చి ఏదో ఒక భంగిమలో వాణ్ణి వధించిపోవాలి. అలాగైతేనే బ్రహ్మవరాన్ని మన్నించినట్టవుతుంది. అంతేగాదు. వాడు ఏడీ ఎక్కడా ఏ రూపంలో ఉంటాడని గదా అడుగుతూ వచ్చాడు. ఇదుగో ఈ రూపంలో వచ్చాను. చూడు. చేతనైతే ఇదేమిటో చూచి అర్థం చేసుకో నా స్వరూపాన్ని అని ఈశ్వరుడు వాడిని నిశ్శబ్దంగా నిలదీసి అడిగే పెద్ద ప్రశ్న ఇది.

  కనుకనే వాడు డింభకా సర్వస్థలములా వాడున్నాడని వాగుతున్నా వీ స్తంభంబున చూపగలవె ? స్తంభంలో చూపకపోతే నీతల వేయి ప్రక్కలు చేస్తానప్పుడా చక్రి వచ్చి నీ కడ్డుపడగలడేమో చూస్తానంటాడు. ఎలాగూ అడ్డుపడతాడప్పుడైన చూడవచ్చుననే ఉందా వైర భక్తుడి హృదయంలో. పిపీలికాది బ్రహ్మ పర్యంతమంతటా ఉన్న వాడీ స్తంభంలో ఉండటానికేమి అభ్యంతరం పొమ్మంటాడు ప్రహ్లాదుడు. పైగా నేడు నీకు ప్రత్యక్షంగా కనపడతా ఉంటాడు. ఎంత సాభిప్రాయమైన మాటో ఇది. ఈశ్వరుడి స్వరూపం అనుభవైక గోచరమైతే ఆయనవిభూతి ఇంద్రియ గోచరం. నీవిలా ఇంద్రియాలతో ప్రత్యక్షంగా చూడాలనుకొంటే అలాగే కనపడతాడు. ప్రతిబంధ మేముందని హెచ్చరిక ఇది. సరే నీ మాట కాదనటం దేని కలాగే చూపమంటూ లేచి సభాభవన స్తంభాన్ని అరచేత ఆస్ఫాలించాడా దానవుడు.

  ఆస్ఫాలించటమేమిటి. వెంటనే ఆవిర్భవించట మేమిటా రూపం. అదృష్ట పూర్వమైన ఆ అద్భుతాకారం చూచి హడలిపోయాడు వాడు.

Page 350

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు