#


Index



నిర్గుణ భక్తులు - ప్రహ్లాదుడు

గదా అనే సమ్యగ్దృష్టితో ఉన్నాడంటున్నాడు. పోతే లేడనే వాడీ ఆ కృతులే గదా మనకు కనిపించటం ఈ ఆకృతులలో దాని ఆకృతి ఎక్కడా కనపడటం లేదు కాబట్టి అది అసలు లేనే లేదు పొమ్మంటాడు. ఇదీ వీరి వాదం. ఈ వాదంతో తలబట్టి పోయిందసలా దేవుడికి. ఒకడెక్కడ బడితే అక్కడ ఉన్నాడంటున్నాడు. మరొకడెక్కడా లేడంటున్నాడు ఏమి చేయాలిప్పుడు. హిరణ్యకశిపుడిప్పుడు తనకు పరీక్ష పెడితే ఏమిటి గతి. పెట్టవచ్చు గూడా. అక్కడ ఉన్న ఏ స్తంభమో కుడ్యమో పగులగొట్టి అంతటా ఉన్నాడన్నావుగదా దీనిలో ఉన్నాడా చూపమని అడిగితే ఏమిటి మార్గం. కనపడటమా, కనపడకపోవటమా, కనపడితే ప్రహ్లాదుడి మాట తప్పవుతుందేమో కనపడకపోతే హిరణ్యకశిపుడి మాట ఒప్పువుతుందేమో ఎలా దీనికి పరిష్కారం.

  ఉన్నట్టుండి పరిష్కారం స్ఫురించిందా పరమాత్మకు. ఇదేమిటి నేను పరమాత్మను గదా. సర్వత్రా ఎలా ఉన్నానో ఏకత్రా కూడా అలాగే ఉండగలను. సర్వత్రా ఉన్నప్పుడేకత్రా ఎలా లేకపోతాను. లేకపోతే అప్పుడు సర్వత్రా అనే మాట కర్థమేముంది. మహా అయితే సర్వత్రా ఉన్న దానికి రూపం లేదు అది నా స్వరూప దశ. పోతే అదే ఏకత్రా ఉన్నదంటే దానికొక విశేషమైన రూపం వచ్చి పడుతుంది. అది నా విభూతి దశ. స్వరూపం విభూతులు రెండూ నేనే గదా. నా అద్వితీయత్వానికి లోపమేముంది. ఇందులో ఈ రెండింటినీ అర్థం చేసుకొన్న పరమ భాగవతుడీ బాలుడు. వీడికోసం ప్రయత్నమక్కరలేదు నాకు. ఎటువచ్చీవయస్సు వచ్చినా అర్థం కాని వృద్ధ బాలుడీ హిరణ్యుడు. వీడికీ నేనేదో ఒక విశేషాకారంగా కనిపిస్తే గాని నమ్మడు నా ఉనికి. అంచేత వీడి నమ్మకం కోసమేదో ఒక రూపంలో కనిపించటమే మంచిది. అప్పుడైనా అర్థం చేసుకొంటే బాగుపడతాడు. లేదా అదే నా రూపమని సగుణ భావనతోనే మరణిస్తాడు. మరణిస్తే మరొక జన్మలోనైనా నిర్గుణ భావముదయిస్తుంది వీడికి. ఇలా ఆలోచించి “శ్రీ నరసింహాకృతి నుండె నచ్యుతుడు నానా జంగమ స్థావరోత్కర గర్భంబుల నన్నిదేశముల నుద్ధండు ప్రభావోన్నతిన్” స్థావర జంగమాత్మకమైన ప్రపంచంలో ప్రతి అణువులో తావన్మాత్రంగా నరుడూ గాని సింహముగాని ఒకానొక విచిత్ర రూపంలో దాగి ఉన్నాడట.

  అప్పటికప్పుడు వేషం వేసుకొన్నాడా లేక అంతకుముందే ఉన్నదా ఈ రూపం. ముందు నుంచీ ఉన్నది గాదు. వేషం వేసుకొన్నదే. రూపమనేది ఎప్పుడూ లేదా

Page 349

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు