దీనిని బట్టి పురాణ లక్ష్యమేమిటో మనకు తేట పడుతున్నది. జ్ఞాన వైరాగ్యోత్పాదనమే దాని లక్ష్యం. శ్రుతి స్మృతి రూపమైన శాస్త్రానికేదో దానికీ అదే. అలాగైతేనే రెంటికీ ఏకవాక్యత Uniformity సిద్ధిస్తుంది. లేకుంటే తీర్థానికి తీర్థం ప్రసాదానికి ప్రసాదమయి దేని దారి దానిదే అవుతుంది. బ్రహ్మజ్ఞానం మానవుడి కందివ్వటమే శాస్త్రోద్దేశం. దాని కోస మక్కడక్కడ మనోహరమైన ఆఖ్యాయికలూ అలంకారాలూ ఏ కరవు పెడుతుంది. సనత్కు, మార నారద సంవాదం - ఇంద్ర విరోచనా ఖ్యాయికా - నచికేతుని కథా-యాజ్ఞవల్క్య జనక సంవాదమూ - ఇలాంటి ఆఖ్యాయిక లెన్నో ఉన్నాయి ఉపనిషత్తులలో. పోతే “అజా మేకామ్ లోహిత శుక్ల కృష్ణామ్ - ద్వా సుపర్ణా సయుజా సఖాయా - ఊర్ధ్వమూలో 2 వాక్శాఖః - ప్రణవో ధనుశ్శరోహ్యాత్మా-ఆత్మానమ్ రథినమ్ విద్ది” ఇలాంటి రూపకల్పన లెన్నో కనిపిస్తాయి. ఇవన్నీ శాస్త్ర తాత్పర్యం కాదు గదా. శాస్త్ర తాత్పర్యమైన బ్రహ్మాత్మ భావాన్ని అందుకోటానికి కల్పించిన సంకేతాలు-కల్పనలు. వీటిని అర్థవాదాలన్నారు శాస్త్రంలో.
అలాంటి అర్థవాదాలే ఈ పురాణ కథలు కూడా. బ్రహ్మతత్త్వాన్నీ దాని నందుకొనే మార్గాన్నీ మనకు బోధించటానికి చేసిన కల్పనలే ఇవన్నీ. కల్పనే కాకపోతే స్తంభాన్ని పెకలించుకొని ఒక సింహరూప మావిర్భవిస్తుందా - తిర్యగ్జంతువైన ఒక గజం మొరపెడితే భగవంతుడు పరుగెత్తి వస్తాడా - ఇలాంటివన్నీ అక్షరాలా జరిగాయని వాదించనక్కరలేదు. అయ్యో జరగలేదని నమ్మకపోతే అది ఎంత అపచారమోనని ఊరక ఉలిక్కి పడనక్కర లేదు. జరిగినవే అయితే ఒక వృత్తాంత మొక పురాణంలో ఒక విధంగా మరొక పురాణంలో మరొక విధంగా పేర్కొనటం సంభవం కాదు గదా. అసలీ చరాచర జగత్తే అబద్దమది కేవలం మన అవిద్యా విలసితమేనని శాస్త్రం ఘోషిస్తుంటే పురుష బుద్ధి కల్పితమైన ఈ పురాణ గాధలు సత్యమని మనం పట్టు పట్టటమేమిటి. భౌతిక సృష్టిని బట్టే గదా వాఙ్మయసృష్టి. భౌతిక సృష్టి పరమార్ధానికి ఒక రెట్టి దూరమైతే దాని ననుసరించి వచ్చిన వాఙ్మయ సృష్టి రెండు రెట్లు దూరం కావలసి ఉంది. కాబట్టి దీనిలో కనిపించిన ప్రతి ఒక్క అంశమూ సమర్ధించటానికి పూనుకోటం అవివేకం. అంతరమైన భావాన్ని కాక పై అక్షరాన్ని మాత్రం పట్టుకు కూచున్నప్పుడే ఇలాంటి తప్పిదం జరుగుతుంది. అంతర్యమేమిటో ఇంతకు ముందే సూచన చేశాము - భగవత్తత్త్వ ప్రతి పాదనమేనని
Page 35