భగవంతుడి లీలలని - భగవద్భక్తుల చరిత్రలనీ చెప్పుకొనేవన్నీ ఇవే. ఇవి ఆ సృష్టి స్థితి లయాలు మూడింటి మీదా ఆధారపడి ఉన్నాయి. అది మరలా వాస్తవంగా జరిగింది కాదు. అంతా ఒకే ఒక స్వరూప మయినప్పుడెలా జరుగుతుంది. అయినా జరిగినట్టు పురాణం వర్ణించిందంటే అది ఈ విభూతి ద్వారా ఆ పరతత్త్వాన్ని భజించటం కోసమే. సత్యమైన ఆ స్వరూపాన్ని అందుకోటానికి కథలన్నీ ఒక సంకేతంగా భావించాలి గాని ఈ కథలే సత్యమని భ్రాంతి పడరాదు.
అయితే లోకంలో ఇది ముప్పాతిక మూడు పాళ్ల మంది కర్థం కావటం లేదు. కొందరు నాస్తికులు ఇదంతా కాకి పిట్ట కథలని హేతువాదం చేసి త్రోసి పుచ్చితే మరి కొందరాస్తికులు ప్రతి ఒక్క మాటా యథార్థంగానే ఒకప్పుడు జరిగిందని సమర్థించబోతారు. ఇద్దరిదీ అస్థాన సంరంభమే. పురాణాలలో ఎక్కడ ఏది చెప్పినా అది తత్త్వం కాదు. తత్త్వజ్ఞానం కోసం చేసిన ఒక మనోజ్ఞమైన కల్పన. "భాగవతామ్నాయము బాదరాయణుడు తా గల్పించె నేర్పొప్ప గన్" అని వాక్రుచ్చాడు పోతరాజు. భాగవతం జరిగిన కథ కాదట. కల్పించిన కథ. కల్పించాలంటే దానికెంతో నేర్పు కావాలి. బాదరాయణుడలాంటి నేర్పరి గనుకనే అంత గొప్ప కల్పన చేశాడు. అసలు మూలకారుడే చాటాడొక ముత్యంవంటి మాట.
కథా ఇమాస్తే కథితా మహాత్మనామ్
విధాయ లోకేషు యశః పరేయు షామ్
విజ్ఞాన వైరాగ్య వివక్షయా విభో
వచో విభూతి - ర్నతు పారమార్థ్యమ్
ఇది భాగవతం ద్వాదశ స్కంధంలోని శ్లోకం. అన్నీ అయిన తరువాత శుకుడు పరీక్షిత్తుకు చెప్పిన ముక్తాయింపు వాక్యమిది. నేనీ కథలన్నీ ఇంత చిలువలు పలువలుగా నీకు వర్ణించి చెప్పానంటే - ఇదంతా నిజంగానే జరిగింది చేసిందని భావించబోకు. ఇది కేవలం వక్తయొక్క వాగ్వైభవమే గాని పరమార్థం కాదు. పరమార్థం కాకపోతే ఎందుకీ కంఠశోష అని ప్రశ్నిస్తావేమో. తద్వారా మీ బోటి జిజ్ఞాసువులకు పారమార్ధికం మీద విజ్ఞానమూ - ప్రాపంచిక విషయాల మీద వైరాగ్యమూ - ఇవి రెండూ కలిగించటమే మా ఈ కథా వర్ణనలలోని ఆంతర్యం
Page 34