#


Index

పురాణములు-వాటి విశిష్టత

  దీనిని బట్టి మూడు భూమికలు తేలుతున్నాయి మనకు. మొదటిది ప్రపంచ భావన. ఇందులో ఈశ్వర దృష్టి కేమాత్రమూ ఆస్పదం లేదు. రెండవది విభూతి భావన. ఇందులో అధిష్ఠాన రూపంగా ఈశ్వరుడూ తత్రీడా రంగంగా ఈ జగత్తూ రెండూ గోచరమవుతుంటాయి. మూడవది స్వరూప భావన. ఇందులో చరాచర సృష్టి అంతా ఈశ్వరుడిలోనే లయమై ఆ ఈశ్వరుడు మన ఆత్మరూపంగానే అనుభవానికి వస్తాడు. ఇక్కడికి వచ్చే సరికిక సంసారమూ లేదు. విభూతీ లేదు. ఈ మొదటి రెండు భూమికలూ అబద్ధమే నని తేలుతుంది. అయితే ఒక రహస్యం గుర్తుంచుకోవాలి మనం. సంసారమనే మొదటి భూమికలో ఈశ్వర స్పర్శ బొత్తిగా లేదు. కాబట్టి అది సాధకుడికి హేయం. కాగా రెండవదైన విభూతి భూమిక నుంచీ దాని స్పర్శ కనిపిస్తుంది. స్వరూప స్థితి అనే తృతీయ దశలో అది పరిపూర్ణంగా అనుభవానికి వస్తుంది. కనుక అదే మనకుపాదేయం. సత్యమైన దాస్థితి. అలాంటి సత్యాన్ని చేరేందుకు సాధనంగా పని చేస్తుంది కాబట్టి అసత్యమైనా విభూతి దశకూడా మనకు వాంఛనీయమే. అది ఇటు సంసార దశను దాటించి మనలను సాయుజ్య దశకు చేర్చే ఒక గొప్ప నిశ్రేణిక లాంటిది. ఈశ్వర స్పర్శ ఉంది కాబట్టి తనపాటికి తాన సత్యమైనా సత్యమైన పరమాత్మ యొక్క అనుభూతిని ప్రసాదిస్తుందది.

  ప్రస్తుతం పురాణాలలో మనం చూచే వ్యవహారమంతా ఈ విభూతి వర్ణనే. సృష్టి స్థితి లయాలే గదా పురాణాలన్నీ వర్ణించే విషయం. అసలు పురాణ లక్షణమే అది. “సర్గశ్చ ప్రతి సర్గశ్చ - వంశో మన్వంత రాణిచ - వంశాను చరితమ్ చేతి పురాణమ్ పంచ లక్షణ”మన్నా రభిజ్ఞులు. ఈ అయిదింటిలో సర్గమంటే సృష్టీ. ప్రతి సర్గమంటే లయం. పోతే ఒక మనువు కాలమయి పోయి మరొక మనువు కాల మారంభమైతే అది మన్వంతరం. అందులోనే మనుసంతతీ వారి సంతతీ వంశమూ - వంశాను చరితమనేవి. ఇదంతా ప్రపంచ స్థితి క్రిందికి వస్తుంది. అప్పటికి సృష్టి స్థితిలయాలే ఈ అయిదింటి తాత్పర్యం. మరి ఈ సృష్టి స్థితి లయాలే భగవ ద్విభూతి అంటే. పోతే ఈ స్థితి కాలంలో ధర్మమనేది అంతరించకుండా కాపాడటానికే భగవంతుడి అవతారాలన్నీ. అందులో దుష్టులైన రాక్షసులను సంహరించటం శిష్టులైన దేవ ఋషి మనుష్యాదులను అనుగ్రహించటం దాని కానుషంగికం. ఇవే గదా పురాణాలలో మనకు కనిపించే కథలన్నీ.

Page 33

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు