#


Index

పురాణములు-వాటి విశిష్టత

  ప్రభు సమ్మితమైన ఈ శాస్త్ర మార్గాన్నే సుహృత్సమ్మితమైన పురాణం కూడా అనుసరిస్తుంది. సర్వాధిష్ఠాన భూతమైన తత్త్వాన్ని పూర్తిగా మరచి మన మీ సంసారాన్ని చూస్తూ దీనిలో తల మునకలవుతుంటే ఇది అంతా ఏదో గాదు ఆ పరమాత్మ విభూతే సుమా - ఇటు జీవసృష్టి - అటు జగత్సృష్టి- రెండూ దాని నాటకమే నని వర్ణిస్తుంది. నిజానికి సృష్టి స్థితి సంహార కథ అంతా వట్టిదే “ఏక మేవా 2 ద్వితీయమ్ బ్రహ్మ” అన్నప్పుడిక ద్వితీయమైన భావానికి చోటెక్కడిది. ఆదిలోనూ లేదు. అంతంలోనూ లేదు. ఆద్యంతాలలో ఉన్నదొక్క బ్రహ్మమే. కనుకనే శాస్త్రమాదిలో అద్వితీయమని ఎలా వర్ణించిందో అంతంలోనూ అలాగే అద్వితీయ తత్త్వంతోనే ఉపసంహరిస్తుంది. “ఐతదాత్మ్యమిదమ్ సర్వమ్ - తత్సత్యం - స ఆత్మా - తత్త్వమసి" పోతే మధ్యలో మాత్రమే జగత్సృష్ట్యాదికమైన భేద కథ పట్టుకు వస్తుంది. ఆదిలో అంతంలో లేని భేదం మధ్యలో ఎలా వచ్చింది. వచ్చింది చేసిందని కాదు. అది ఒక వేదాంత ప్రక్రియ Methodology. అభేదాన్ని దృఢంగా మనసులో నిలుపుకోటాని కొక ఉపాయ Means మది. “ఉపాయస్సోవతా రాయ నాస్తి భేదః కథంచన” అని గౌడపాదులెప్పుడో చెప్పారు. జగత్సృష్టి జీవ ప్రవేశాది వర్ణనమంతా అప్పటికి యథార్ధంగా జరిగిందని చేసిందని భావించరాదు మనం. అభిన్నమైన తత్త్వాన్ని అర్థం చేసుకోటానికి – అందుకోటానికి - ఒక ఆలంబనంగా సంకేతంగా తీసుకోవాలి దాన్ని. అది ఎలాగ.

  పరమాత్మను మరచిపోయి కేవల మీ నామరూపాత్మకమైన సంసారాన్నే చూస్తున్నాము. కాబట్టి ఈ జగత్తు నుంచి మన దృష్టి దానివైపు మళ్లించాలి. మళ్లించాలంటే ఏమి చేయాలి. దీని సృష్టి స్థితి లయాలన్నీ దాని మూలంగానే జరిగాయని దీని యావద్భారాన్నీ దానిమీద అసలు లేకపోయినా ఉన్నట్టు ఆరోపించాలి. అప్పుడిదంతా దాని వైభవమే దాని విలాసమేనని ఆ సూత్రాన్ని విడవకుండా దీనిని పట్టుకొంటాము. దీనివల్ల కేవల సంసారమనే దృష్టి పోయి ఇది ఆ ఈశ్వర విభూతి అనే ఉదాత్తమైన దృష్టి ఏర్పడుతుంది మానవుడికి. ఇలా ఈశ్వర విభూతేనని ఎప్పుడు దర్శించామో ఆదర్శనమంతకంతకు గట్టి పడే కొద్దీ ప్రతి ఒక్కటీ ఇందులో ఈశ్వర చైతన్యమే గాని అంతకు భిన్నంగా మరేమీ కాదని ప్రపంచమంతా నిరాకృతమవు తుంది. కేవల మీశ్వర స్వరూపమే మిగులుతుంది. అప్పుడు సంసారంలాగా విభూతి కూడా మిథ్య అని తేలిపోయి ఏకమే వాద్వితీయమనే స్వరూప స్థితినే అందుకోగలం.

Page 32

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు