అప్పుడదీ ఒక శ్రుతిలాగా ప్రభు సమ్మితమయి కూచుంటుంది. అంచేత దానినే ఆఖ్యానాల రూపంగా ఉపాఖ్యానాల రూపంగా రకరకాల వన్నెలు చిన్నెలు పెట్టి అనేక విధాల వర్ణిస్తూ పోతుంది. మరి తత్త్వమనేది ఏకరూపం గదా. అనేక రూపాలుగా వర్ణిస్తే అది యథార్థమెలా అవుతుంది. ఇక్కడే ఉంది రహస్యం. ఏకమైనా అది అనేక రూపాలుగా భాసిస్తున్నది. అదే ఈ ప్రపంచం. అలా భాసించటం దాని యోగమాయా ప్రభావం వల్లనైనా కావచ్చు. అనాది సిద్ధమైన మన అజ్ఞాన విజృంభణ వల్లనైనా కావచ్చు. ఏదైతే నేమి ఫలితమొక్కటే. అది ఏకమైన తత్త్వం అనేక రూపాలుగా గోచరించడం. అనేకంగా గోచరించేసరికీ నామరూపాలలో ఎక్కడికక్కడ తగులుకొని మానవుడి బుద్ధి దీనినంతటినీ కలుపుకొని సమష్టిగా దర్శించే శక్తిని కోలుపోయింది. మన బుద్ధి బలహీనమయ్యే కొద్దీ నామరూపాత్మకమైన సృష్టి బలాన్ని పుంజుకొన్నది. మనమీద నిత్యమూ దాడి చేస్తున్నది. సుఖదుఃఖాది ద్వంద్వాలకు మనలను గురి చేస్తున్నది. దానితో అసలు తత్త్వానికి బాగా దూరమై పోయాము. ఇదే సంసారమంటే.
ఇప్పుడీ సంసార జంబాలం నుంచి బయట పడాలంటే మరలా మన మా పరమాత్మతో సాయుజ్యాన్ని భజించాలి. అంటే అనేకత్వం నుంచి మరలా ఏకత్వంవైపు పయనించాలి. అనేకత్వమెప్పుడూ అసత్యమే. అది ఏకత్వం తాలూకు ఆభాస. ఏకత్వమే వస్తువు. వస్తువే సత్యం కాని ఆభాస అనేది సత్యం కాదు. కారణమేమంటే నిరూపణ చేసి చూస్తే వస్తువుకంటే భిన్నంగా కనిపించదది. ఇప్పుడీ చరచార ప్రపంచమంతా సచ్చిద్రూపమైన పరమాత్మకన్నా అతిరిక్తంగా లేదు. కాబట్టి ఇది అసత్యం. అసత్యమైనా దీని నసత్యమని చూడటం లేదు మనం. మీదు మిక్కిలి ఎంతో గొప్ప సత్యమని నిత్యమూ దర్శిస్తున్నాము. ఇప్పుడీ దర్శన మొక్కసారిగా మిథ్య అని శాస్త్రజ్ఞులు చెబితే మనకు నమ్మటానికి బుద్ధి పుట్టదు. పైగా అది మన ప్రకృతానుభవానికి విరుద్ధంగా తోచటంవల్ల త్రోసి పుచ్చుతాము. త్రోసి పుచ్చితే పుచ్చారు లెమ్మని చెప్పి శాస్త్ర ముదాసీనంగా ఉండబోదు. పిల్లవాడు తెలియక హఠం చేసినా తల్లి బుజ్జగించినట్టు ఏదో ఒక మార్గంలో మనకు హితం చెప్పటానికే ప్రయత్నిస్తుంది. ఆ మార్గమేదో గాదు. మన అనుభవాన్ని కాదనకుండా మనల ననుసరిస్తూనే క్రమంగా మన చేతనే దాన్ని కాదనిపించటం. దీనినే అధ్యారోపాపవాద న్యాయమంటారు శాస్త్రంలో.
Page 31