#


Index

పురాణములు-వాటి విశిష్టత

పురాణ వాఙ్మయానికింతటి విశిష్టత ఉండటం మూలాన్నే మొదటినుంచీ జన సమాజంలో పురాణ శ్రవణమనేది బాగా ప్రచారంలోకి వచ్చింది. పెద్ద పెద్ద రాజాస్థానాల్లో పౌరాణికులైన పండితులెందరో ఉండేవారు. నానాపురాణ విజ్ఞాన నిరతుణ్ణని ఆది కవి నన్నయ భట్టు స్వయంగా చెప్పుకొంటాడు. పది మందికి కలిగే సందేహాలు ఎప్పటి కప్పుడీ పౌరుణికులు తీరుస్తుండే వారు. ఇప్పటికీ దేవాలయాలలో బహిరంగంగానూ – ధనికులైన ఆస్తికులైన గృహస్థుల ఇండ్లలో అంతరంగంగానూ - పురాణ కాలక్షేపం జరుగుతుండటం ఒక ఆచారం. భాగవతులనీ హరికథకులనీ హరిదాసులనీ - ఇలాంటి సంప్రదాయం లోకంలో ఈ పురాణ పఠన పాఠనాల వల్లనే అవతరించింది. భగవత్తత్త్వాన్నే అనేక విధాల లోకానికి చాటుతూ పరమార్ధమైన మోక్ష పురుషార్థాన్నే ముఖ్యంగా చాటిచెప్పే పురాణ వాఙ్మయానికింత బహుళ ప్రచారం వచ్చిందంటే ఆశ్చర్యమేముంది. అది సర్వ విధాలా సముచితమే సమంజసమే ననిపిస్తుంది.

  పురాపి నవమే వేతి పురాణ” మని వక్కాణించారు మన పెద్దలు. ప్రాచీనమైనప్పటికీ నవీనమైనదేదో అది పురాణ మాట. చూడబోతే ఈ నిర్వచనం ప్రౌఢమే గాక చాలా వింతగా కనిపిస్తుంది. ప్రాచీనమై నవీనమెలా అయిందది. ప్రాచీనత అనేది తత్ప్రతి పాదితమైన వస్తువులో అయితే - నవీనత తత్ప్రతి పాదన మార్గంలో నని జవాబు. పురాణ ప్రతిపాద్యమైన వస్తువేది. పరమాత్మ తత్త్వం తద్విజ్ఞానం వల్ల కలిగే మోక్షఫలం. ఇది ఎప్పుడూ ఉన్నదే. మనం క్రొత్తగా సృష్టించేది గాదు. మానవుడు తెలుసుకోకముందూ ఉంది. తెలుసుకొనేప్పుడూ ఉంది. తెలుసుకొన్న అనంతరమూ ఉంది. అనాదీ అనంతమూ అయిన భావమది. అది ఈ ప్రపంచానికీ మనకూ గూడ స్వరూపమే. అయితే ఆ సత్యాన్ని మరచి పోయాము. కాబట్టి మరలా జ్ఞాపకం చేస్తూంది పురాణం. అంచేత “వాస్తవ మత్ర వస్తు శివదమ్” అని భాగవతకారుడు చెప్పినట్టు పురాణ వస్తువు ప్రాచీనమే.

  అయితే మరి నవీనమేమిటి. నవీనం దాని నిర్మాణం. దాని ప్రణాళిక. దాని ప్రతిపాదన. విషయం ప్రాచీనమైనా దాని నావిష్కరించే పద్ధతి క్రొత్తది పురాణంలో. విషయమంటే పరమాత్మ తత్త్వమేనని గదా పేర్కొన్నాము. తత్త్వాన్ని సూటిగా చెప్పదు పురాణం. చెబితే అందులో స్వారస్యం లేదు. శుష్కంగా తయారవుతుంది.

Page 30

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు