విషయం కాబట్టి ముముక్షువులైన భక్తులూ జ్ఞానులే పురాణ పాత్రలు కావటంలో ఆశ్చర్యం లేదు. మరి వారికలాంటి జ్ఞానాన్ని మోక్షాన్ని ప్రసాదించవలసిన వాడు భగవానుడే కాబట్టి ఆయనే పురాణాలలో కథా నాయకుడు. ఏ పురాణం చూచినా భగవంతుండే ప్రధాన పురుషుడు. తన్ముఖంగానే నడుస్తుంది పురాణమంతా. భగవంతుని నామమూ - ఆయన అవతారాలు - ఆయన లీలలూ - వీటిని చిలవలు పలవలుగా వర్ణించటమే పురాణ జీవితం. నిత్యముక్తుడైన పరమాత్మ ప్రధానపాత్ర వహిస్తే ముముక్షువులైన సాధకులంతా ఆయన చుట్టూ పరిభ్రమిస్తూ తమ జీవితాలు గడుపుతుంటారు.
ఇది భాగవతాది పురాణాలేవి చూచినా మనకు తార్కాణమయ్యే సత్యం. లీలా మానుషమూర్తిగా అవతరించిన శ్రీకృష్ణ భగవానుడే గదా భాగవత కథా గమనాని కంతటికీ సూత్రధారుడు. ప్రథమ స్కంధం నుంచీ ద్వాదశ స్కంధం దాకా పరచుకొని ఉన్నదా మహనీయుడి చరిత్ర. కృష్ణ కథామృతంబని ఈ పురాణానికి పేరు పెట్టటం కూడా ఇందుకే. పోతే ప్రహ్లాద కుచేలాది భాగవతులంతా ఇక ఆ భగవదర్పిత చిత్త వృత్తులయి తమ జీవితాలు సాగించిన వారే. వారందరూ ఆ భగవన్మార్గంలోనే సంచరించారు. వారికి కావలసిన దాయన సాయుజ్యమే. స్వర్గాదులేవీ కావు. మమ వర్క్ష్మాను వర్తంతే అని భగవానుడు చాటిన మాట వారందరి పట్లా అక్షరాలా సమన్వితమైన మాట. ఇలా ఆశ్రితాశ్రయ భావంతో అవినాభావంగా సాగిన చరిత్ర కాబట్టి అది భగవంతుడి చరిత్రా భాగవతుల చరిత్ర కూడా. దీనిని బట్టి ప్రతి పురాణమూ ఒక భాగవతమే కారణమేమంటే ప్రతి ఒక్కటీ భగవద్భాగవత కథామయమే. మోక్ష పురుషార్థ ప్రధానమే.
ఇంతకూ ప్రభు సమ్మితమైన శాస్త్రాలూ ధర్మమూ మోక్షమూ రెండింటినీ బోధిస్తే అందులోనూ శుష్కమైన మార్గంలో బోధిస్తే- మిత్ర సమ్మితమైన పురాణేతి హాసాలు రెండూ వాటినే సరసంగా కథారూపంగా వర్ణిస్తాయి. అందులో కూడా ఇతిహాసాలు ధర్మాన్నే ప్రధానంగా పేర్కొంటే పురాణమలా కాక ధర్మాన్ని ఉపసర్జనం చేసి పరమ పురుషార్ధమైన మోక్షాన్నే తాత్పర్య దృష్టితో లోకానికి చాటుతున్నది. కనుక శాస్త్రం కంటే ఇతిహాసం-ఇతిహాసం కంటే పురాణం మానవుడి కతి సన్నిహితమూ - మనోరంజకమూ - శ్రేయోదాయకమూ నని వేరుగా చెప్పనక్కరలేదు.
Page 29