ఇలాంటి మోక్ష పురుషార్థ బోధకమైన ఘట్టాలు కూడ లేకపోలేదు. అయినా అవి ఆపాతతః బోధించటం వరకేగాని వాటి నాకర్ణించిన ధృతరాష్ట్ర ధర్మజార్జునాదులా మోక్షమార్గంలో పయనించింది లేదు. మోక్షాన్ని పొందింది లేదు. శ్రవణం వరకే అవి. సాక్షాత్కారానికి నోచుకోలేదు వారు. సాక్షాత్కారమే అయితే మోక్షపదవినే అందుకొని ఉండేవారు. ఏదీ ధర్మజుడు గాని, అర్జునుడు గాని ఎవరూ భారతంలో ముక్తులయినట్టు నిదర్శనం లేదు. కేవలం స్వదిలినీనిరోహణంతోనే సమసిపోయింది వారి జీవితం. దీనిని బట్టి ఇతిహాసాలన్నీ ధర్మ ప్రధానాలే గాని మోక్షపరాయణాలు కావు.
ధర్మప్రధానాలు గనుకనే ఇతిహాసాలలో మానవులే ప్రధాన పాత్రలు. సామాన్య మానవులందరికీ కావలసిందీ ఆచరణ యోగ్యమయిందీ ధర్మమే గదా. కనుకనే వారికే అందులో ప్రాధాన్యం భగవత్తత్త్వానికంత ప్రాధాన్యం లేదు. అది కేవలం వారి వెనకాల చేరి వారి జీవితాలను సరియైన మార్గంలో నడపటం వరకే. పోతే అప్పుడప్పుడు వారికేవైనా ఉపద్రవాలు సంభవించినప్పుడాదుకోవటం కూడా కద్దు. అంత మాత్రమే పరమాత్మకు ప్రవేశం. అలా ప్రచ్ఛన్నంగా ఉండి నాటకం నడుపుతూ పోవలసిందే గాని తాను ముందుకు వచ్చి ఒక పాత్రను నిర్వహించటమంటూ కానరాదు. ఇది భారతం ఆమూలాగ్రంగా చదివిన వారందరికీ విదితమే. అయితే రామాయణంలో కథానాయకుడు సాక్షాత్తూ అవతార పురుషుడే గదా అక్కడ ఈ సూత్రమెలా సరిపడుతుందని అడగవచ్చు. అవతార పురుషుడే అయినా మాయా మానుషుడాయన “ఆత్మానమ్ మానుష మ్మన్యే" అని ఏమని వాక్రుచ్చాడో ఆ మాటకు దగినట్టు తన దివ్యత్వాన్ని కప్పి పుచ్చి కొనా మొదలూ మానవోచితంగానే వ్యవహరించాడు. అంచేత అందులోనూ భారతంలాగా మానవుడికే ప్రాధాన్యం.
ఇది ఇతిహాస లక్షణమైతే పురాణ లక్షణం దీనికి వ్యతిరిక్తంగా కనిపిస్తుంది. ఇతిహాసాలు ధర్మ ప్రధానమని గదా పేర్కొన్నాము. వాటికి భిన్నంగా పురాణాలన్నీ మోక్షప్రధానాలు. ఆయా లోక ధర్మాలక్కడక్కడా ప్రవచించినా మోక్ష పురుషార్థాన్ని ప్రదర్శించటమే వీటి ఏకైక లక్ష్యం. కనుకనే వీటిలో పాత్రలు సామాన్య మానవులు కారు. “మనుష్యాణామ్ సహస్రేషు” అన్నట్టు లక్షకు కోటికొకడుంటాడు మోక్షకామి అయిన వ్యక్తి. అలాంటి పరతత్త్వ జిజ్ఞాసువులూ ముముక్షువులూ అయిన మహనీయులెవరో వారే పురాణాలలో పాత్రలు. మోక్షపురుషార్థమే ప్రతిపాద్యమైన
Page 28