#


Index


పురాణములు-వాటి విశిష్టత

  పసిపిల్లల మనస్తత్త్వం. సూటిగా ఉన్నదున్నట్టు చెబితే వినటానికి బుద్ధి పుట్టదు. అదే కథా రూపంగా అందిస్తే ఎంతో ఉత్సాహంతో ఆలకిస్తారు. తదనుగుణంగా ఆచరిస్తారు. అందుకే చిన్న పిల్లలకు మనం కాకి పిట్ట కథలు చెప్పి వారి నానంద పరచటం. వీటికే శాస్త్రజ్ఞులర్ధవాదాలని పేరు పెట్టారు వాటి కోవకు చెందినవే ప్రస్తుత మీ ఇతిహాసాలూ, పురాణాలూ. ఇవి చిన్న పిల్లల కథలలాగా కేవలం కాల్పనికమే. కానీ కాల్పనికమైనా ఆకల్పితమైన ప్రత్యయాలనే బయట పెడుతుంటాయి. ఇదుగో ఇలా శాస్త్రం యొక్క అడుగుజాడలలోనే పయనిస్తున్నాయి కాబట్టి శ్రుతి స్మృతులెంత ప్రమాణమో అవీ మనకంత ప్రమాణమే. రెండూ మనకొకే జీవిత సత్యాలను చాటుతున్నాయి. అవి ప్రభు సమ్మితంగా అయితే ఇవి మిత్ర సమ్మితంగా. అంతే తేడా మిత్ర సమ్మితం కాబట్టి వాటికన్నా ఇవే మనకింకా సన్నిహితం. కథాత్మకం కాబట్టి ఇంకా మనోరంజకం.

  అయితే ఒక చిన్న ఆశంక. పురాణాలైనా ఇతిహాసాలైనా రెండూ అర్థవాదాలే గదా. కథా రూపాలే గదా. వాటి రెంటికీ తేడా ఏమిటీ అని. రెండూ కథలే అయినా రెండింటిలో ఒక విశేషముంది. శాస్త్రం మనకు బోధించే పురుషార్థాల నివి రెండూ చెరి ఒకటి పంచుకొన్నాయి. ధర్మమూ, మోక్షమూ ఇవి రెండే గదా పురుషార్ధాలని చెప్పాము. ఇందులో ఇతిహాసం ధర్మాన్ని ప్రధానంగా బోధిస్తుంది. పురాణం మోక్షాన్ని ప్రధానంగా ప్రతిపాదిస్తుంది. అయితే ఇది ప్రాధాన్యాన్ని బట్టి మాత్రమే చెప్పిన మాట. అంచేత ఇతిహాసంలో మోక్షప్రసక్తి లేదని పురాణంలో ధర్మప్రసంగమే ఉండబోదని మరలా అపోహ పడరాదు. ఉంటుంది. అయితే దానికి ప్రాధాన్యం ఉండబోదు. కేవల ముపసర్జనం Subsidiary మాత్రమే.

  ఇంతెందుకు. రామాయణ భారతాలనే తీసుకొని చూడండి. ఇవి రెండే ఇతిహాసాలు మనకు. రెండూ ధర్మ ప్రధానాలే. రామాయణంలో ఎక్కడ ఏ ఘట్టం చూచినా పితృధర్మం-పుత్ర ధర్మం- భ్రాతృ ధర్మం- స్వామి ధర్మం- భృత్య ధర్మం మిత్ర ధర్మం -రాజధర్మం- అన్నీ ధర్మాలే. మోక్షధర్మమనే గంధం కూడా లేదందులో, మరి భారతంలో కూడా విదురనీతి గాని ధర్మవ్యాధోపాఖ్యానాదులుగానీ, శాంత్యను శాసనాది పర్వాలుగానీ- ఏవి చూచినా రాజలోక వ్యక్తి ధర్మాలే కుప్పతెప్పలుగా కనిపిస్తాయి. అయితే భగవద్గీత, సనత్సుజాతీయం, మోక్షధర్మాలు, అను గీతలు-

Page 27

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు